నల్లగొండ, జూలై 27 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ పథకానికి అర్హులైన రైతులకు సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ మొత్తాన్ని జమ చేయడంతోపాటు వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలన్న వినతిని పరిశీలించి రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సూరేపల్లి నందా ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ జిల్లా సూరారం గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి, మల్లారెడ్డి అద్దూదొల్లు అనే ఇద్దరు రైతులు ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వీరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి సాగు కోసం ఒకొకరు రూ.1.6 లక్షల పంట రుణం తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వం 2024 డిసెంబర్ 9న రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ పథకాన్ని ప్రకటించగా, వీరి పేర్లు అర్హుల జాబితాలో కూడా చోటు దకించుకున్నాయి. అయితే, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిపోవడంతో ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ కాకుండా తిరిగి ప్రభుత్వ ఖాతాకు వెళ్లిపోయాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ కారణంగా గత ఏడాదిన్నర కాలంగా రుణంపై వడ్డీ చెల్లించాల్సి వచ్చిందని, రుణమాఫీ మొత్తాన్ని తమ ఖాతాల్లో జమ చేయడంతోపాటు చెల్లించిన వడ్డీని కూడా తిరిగి ఇవ్వాలని 2026 మార్చి 13న జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలను పరిశీలించిన హైకోర్టు, వారి పేర్లు రుణమాఫీ అర్హుల జాబితాలో సీరియల్ నంబర్లు 6,733, 6,758 వద్ద ఉన్నాయని, పథకానికి అర్హులైనా ఇప్పటివరకు ప్రయోజనం అందలేదని గమనించింది. ప్రభుత్వం ప్రకటించిన పథకం ప్రకారం వారికి లబ్ధి కల్పించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లు 2026 మార్చి 13న సమర్పించిన వినతిని జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి చట్టప్రకారం పరిశీలించి, రుణమాఫీ నిధులను వారి ఖాతాల్లో జమ చేయడం, గత ఏడాదిన్నర కాలంగా చెల్లించిన వడ్డీని తిరిగి చెల్లించే అంశంపై తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను ఉత్తర్వుల ప్రతిని అందుకున్న తేదీ నుంచి రెండు వారాల్లో పూర్తి చేసి, తీసుకున్న నిర్ణయాన్ని పిటిషనర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది.