Above 40 Years Nutrients | జీవితంలో 40 ఏళ్లు పూర్తి కావడం ఆరోగ్యపరంగా ఒక ముఖ్యమైన దశగా చెప్పవచ్చు. 40 ఏళ్ల తరువాత ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బలహీనంగా మారడం, రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ దశలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. 40 ఏళ్లు దాటిన తరువాత జీవిత వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే సరిపోతుంది. ఈ వయసులో శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు, సప్లిమెంట్స్ ను తీసుకుంటూ చక్కని జీవనశైలిని పాటిస్తే అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 40 ఏళ్ల వయసులో ఎటువంటి సప్లిమెంట్స్ ను, పోషకాలను తీసుకోవాలో.. వైద్యులు వీటి గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
వయసు పెరిగే కొద్ది విటమిన్ బి12 శోషణ తగ్గుతుంది. విటమిన్ బి12 సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల నరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎర్రరక్తకణాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. శక్తి స్థాయిలు నిల్వ ఉంటాయి. వయసు పైబడే కొద్ది శరీరంలో వాపు పెరుగుతుంది. కనుక ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, కంటి ఆరోగ్యం మెరుగుపడతాయి. అలాగే 40 ఏళ్ల తరువాత ఎముకల ధృడత్వం తగ్గడం ప్రారంభమవుతుంది. కనుక తగినంత క్యాల్షియం ఉండే ఆహారాలను లేదా సప్లిమెంట్స్ ను తీసుకోవాలి. దీని వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుతుంది. 40 ఏళ్ల తరువాత విటమిన్ డి3 లోపం సాధారణంగా కనిపిస్తుంది. కనుక విటమిన్ డి3 సప్లిమెంట్స్ ను తీసుకునే ప్రయత్నం చేయాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం క్యాల్షియంను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు, కండరాలు బలంగా తయారవ్వడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె, కండరాల పనితీరుకు పొటాషియం సప్లిమెంట్స్ ను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నరాల సంకేతాలు సరిగ్గా పని చేస్తాయి. అదే విధంగా వయసు పెరిగే కొద్ది శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం, గాయాలు నయం అయ్యే సామర్థ్యం తగ్గడం జరుగుతుంది. కనుక జింక్ సప్లిమెంట్స్ ను తీసుకోవాలి. ఈ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల వాపులు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కండరాలు, నరాల పనితీరుకు మెగ్నీషియం చాలా అవసరం. మెగ్నీషియం సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కణాలను రక్షించడానికి, థైరాయిడ్ గ్రంథి పనితీరుకు సెలీనియం చాలా అవసరం. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా శరీర ఆరోగ్యాన్ని బట్టి తగిన సప్లిమెంట్స్ ను తీసుకుంటూ చక్కని జీవనశైలిని పాటించడం వల్ల 40 ఏళ్లు దాటిన తరువాత కూడా ఉత్సాహంగా పని చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.