మరికల్, జులై 28: మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట స్టేజి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) వ్యక్తి మృతిచెందారు. ధన్వాడ గ్రామానికి చెందిన కావలి భాస్కర్ (36) ట్రాక్టర్ బేరింగ్లు తీసుకురావడానికి మహబూబ్‌నగర్‌కు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి మక్తల్ వైపు వస్తున్న కారు.. లారీని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. దీంతో భాస్కర్ బైక్‌పై నుంచి ఎగిరి రహదారి పక్కనున్న కంప చెట్టలలో పడిపోయారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టి చెట్టుకు ఢీ కొట్టి ఆగింది. కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుని భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు మరికల్ ఎస్ఐ రాము తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.