Black Sesame Seeds | నువ్వులను ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే నువ్వుల్లో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అని రెండు రకాలు ఉంటాయి. చాలా మంది తెల్ల నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. తెల్ల నువ్వులు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. కానీ తెల్ల నువ్వుల లాగా నల్ల నువ్వులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కూడా అనేక పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. నల్ల నువ్వులు కూడా ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఎముకలకు, నరాలకు, స్నాయువులకు, చర్మ ఆరోగ్యానికి ఇవి ఎంతో మద్దతును ఇస్తాయి. ఆయుర్వేదంలో నల్ల నువ్వులు ఒక శక్తివంతమైన ఆహార కేంద్రంగా పరిగణించబడతాయి. నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల శరీరానికి అందే పోషకాల గురించి, శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల నువ్వుల్లో క్యాల్షియం, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల తగినంత శక్తి లభించడంతో పాటు కణజాలాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నల్ల నువ్వులు కండరాల మరమ్మత్తుకు, పెరుగుదలకు అవసరమయ్యే ప్రోటీన్, అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటాయి. ఈ నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కణజాలాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. మొత్తం జీవశక్తికి మద్దతును ఇస్తాయి. నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల కండరాలు, స్నాయువులు బలంగా తయారవుతాయి.
నల్ల నువ్వులు మాత్రమే కాకుండా ఈ నువ్వుల నూనె కూడా సహాయపడుతుంది. నల్ల నువ్వుల నూనె వెచ్చని స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ నూనెను రాసుకోవడం ద్వారా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కండరాల నొప్పి తగ్గుతుంది. గాయపడిన లేదా అలసిపోయిన కణజాలాలను వేగంగా మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది. ఈ నూనె నరాలకు, వెన్నెముకకు పోషణనిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. ఈ నూనెను తగిన మోతాదులో చర్మానికి రాసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తయారవుతుంది. నల్ల నువ్వులు లేదా వాటి నూనెను క్రమం తప్పకుండా వాడడం వల్ల కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కణజాలాల మరమ్మత్తు జరుగుతుంది. మొత్తం శరీరం స్థితిస్థాపకత పెరుగుతుంది. తెల్ల నువ్వుల లాగా నల్ల నువ్వులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.