లక్నో: అత్తగారింట్లో వేధింపులు భరించలేక.. ప్రేమ పెండ్లి చేసుకున్న నాలుగు నెలలకే ఓ కానిస్టేబుల్ భార్య తనువు (Suicide) చాలించింది. కట్నం గురించి ఇబ్బందులకు గురిచేశారని, మరో పెండ్లి చేసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్నది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది.
లక్నోలోని బక్షి కా తలాబ్ పోలీస్ స్టేషన్లో అనురాగ్ సింగ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. సౌమ్య కశ్యప్ అనే మహిళను నాలుగు నెలల క్రితం ప్రేమ పెండ్లి చేసుకున్నారు. అయితే కట్నం తీసుకురాకపోవడంతో వివాహం జరిగిన నాటి నుంచే భర్త, అత్తింటి వారి నుంచి సౌమ్యకు వేధింపులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడితో, అనురాగ్ ఆమెను మరో వివాహం చేసుకోవాలని కూడా బలవంతం చేయసాగాడు. తరచూ ఆమెను కొట్టేవాడని ఆరోపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేసింది.
భర్తతోపాటు, ఆయన కుటుంబ సభ్యులు తనను మానసికంగా వేధించారని పేర్కొంది. తన భర్త, ఆయన బావ, బావ సోదరుడు కూడా తనను హింసిచారని తెలిపింది. తన భర్త అంకుల్ ఒకరు లాయర్ అని, ఆయనను నన్ను చంపాలని సలహా ఇచ్చాడని, కాపాడుతానని చెప్పారని వెల్లడించారు. వారి వద్ద డబ్బు ఉందని, దానితో వారు ఏదైనా చేయగలరని ఆవేదన వ్యక్తం చేశారు. తన మరణానికి కారణం వారేనని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుని మరణించిందని జితేంద్ర దూబే అనే పోలీస్ అధికారి ధృవీకరించారు. ఇన్స్పెక్టర్తోపాటు సీనియర్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారని చెప్పారు. ఫోరెన్సిక్ టెస్టులు కూడా చేశామని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.