Bat meat : గబ్బిలాల (Bats) ను వేటాడి మాంసం వండుతారు. ఆ మాంసాన్ని చికెన్ (Chicken) అని చెప్పి వినియోగదారులకు విక్రయిస్తారు. ఇద్దరు వ్యక్తులు చాలారోజులుగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. తమిళనాడు (Tamil Nadu) లోని సేలం జిల్లా (Selam district) లో జరుగుతున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒమలూర్ సమీపంలోని డానిష్పేట్టై వద్ద గబ్బిలాలను వేటాడి, వాటిని వండుతున్నారు. అలా వండిన మాంసాన్ని చికెన్ పేరు చెప్పి అక్రమంగా విక్రయిస్తున్నారు. అయితే తోప్పూర్ రామస్వామి అటవీ పరిధిలో పలుమార్లు గన్షాట్ల శబ్దాలు వినిపించినట్టు తాజాగా అటవీ అధికారులకు సమాచారం అందింది. దాంతో ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలోని ఒక బృందం ఎంక్వయిరీ చేపట్టింది. ఇద్దరు వ్యక్తులు అటవీ ప్రాంతంలో ఫ్రూట్ బ్యాట్ల (పండ్లు తినే గబ్బిలాలు) ను వేటాడి, వాటిని వండి, చికెన్లా విక్రయిస్తున్నట్లు ఆ ఎంక్వయిరీలో తేలింది.
దాంతో అధికారులు ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరిలో ఒకరి పేరు కమల్, మరొకరి పేరు సెల్వం అని గుర్తించారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. కాగా ఫ్రూట్ బ్యాట్లు భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్-II జాతిగా రక్షణ పొందుతున్నాయి. వీటిని వేటాడటం లేదా అమ్మడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ నేరానికి గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. 2021లో తుమకూరు జిల్లాలో 25 ఫ్రూట్ బ్యాట్ల కళేబరాలను రవాణా చేస్తుండగా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు కూడా వాటిని మాంసం కోసం బెంగళూరు, తుమకూరులో అమ్మేందుకు రవాణా చేస్తున్నారని తెలిసింది.
ఫ్రూట్ బ్యాట్ల వేటవల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిందితులు కమల్, సెల్వంపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, సెక్షన్ 9, 39 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేరాలకు గరిష్టంగా రూ.3 లక్షల జరిమానా లేదా ఆరు నెలల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.