మోర్తాడ్, ఫిబ్రవరి 27: పసుపు రైతులను మోసం చేస్తే సహించేదిలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ మార్కెట్‌యార్డ్‌లో పసుపు కొనుగోలు ప్రక్రియలో ఈ -నామ్ లో ఏర్పడిన సాంకేతిక లోపాలతో పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇప్పటికే ఈ-నామ్ విధానంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ సరైన శిక్షణ లేకుండా, సాంకేతిక సదుపాయాలు సిద్ధం చేయకుండా కొత్త విధానాన్ని అమలు చేయడంతో ఏర్పడిన సాంకేతిక లోపాలతో పసుపు కొనుగోళ్ల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌కు పసుపు పంట గణనీయంగా వచ్చినా ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేక కొనుగోలు సక్రమంగా చేయడంలో విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫలితంగా రైతులు ప్రతిసారి పంటను అమ్ముకోవడానికి మూడునాలుగు రోజులు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.
పసుపు పంటతో నిజామాబాద్ జిల్లా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలిగేలా రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు వ్యవహరించడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరితో మార్కెట్‌యార్డులో రైతులు తమ పసుపును అమ్ముకోవడానికి రోజుల తరబడి వేచిచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని తెలిపారు. పారదర్శకత లేకుండా బహిరంగవేలం ద్వారా పసుపుకొనుగోళ్లు చేయడం ద్వారా రైతులకు నష్టం జరిగి దళారులకు లాభం చేకూర్చడాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు.
మార్కెట్‌యార్డ్‌కు పసుపు తీసుకొచ్చి మూడు, నాలుగు రోజులైనా సరైన ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను నష్టపరిచే ప్రయత్నం దళారులు చేసే అవకాశం ఉందని తెలిపారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి పసుపు రైతులను నష్టం కలిగిస్తే సహించేది లేదని, వారికి నష్టం జరిగితే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ-నామ్ విధానంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని, దళారుల ద్వారా పసుపు రైతులు మోసపోకుండా చూడాలని కోరారు. రైతుల పక్షాన తాము ఎల్లప్పుడు నిలబడతామని, సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఎమ్మెల్యే వేముల హెచ్చరించారు.