న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో సెప్టెంబర్ 16 నుంచి 27 వరకు జరగనున్న తాజా ఎడిషన్ కోసం బలమైన జట్లను శుక్రవారం ప్రకటించారు. 2024లో ఓపెన్, మహిళల విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించిన భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మెగా టోర్నీకి సిద్ధం అవుతోంది.
ఓపెన్ విభాగంలో ప్రపంచ చాంపియన్ డి. గుకేష్, అద్భుత ఫామ్‌లో ఉన్న ఆర్.ప్రజ్ఞానంద, అర్జున్, విదిత్ గుజరాతితో పాటు కొత్తగా నిహాల్ సరీన్ పోటీపడుతున్నాడు. ఈ జట్టుకు శ్రీనాథ్ నారాయణన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మహిళల విభాగంలో కోనేరు హంపి, క్యాండిడేట్స్ టోర్నీ విజేత ఆర్. వైశాలి, ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, సవిత శ్రీతో కూడిన జట్టుకు స్వయంశ్ మిశ్రా కెప్టెన్‌గా ఉన్నాడు. 2024 విజేత జట్టులో లేని హంపి, సవిత శ్రీ చేరికతో మహిళల జట్టు మరింత బలంగా మారింది.