బీజేపీ రాజకీయ వేధింపుల కుట్ర గుట్టు రట్టయ్యింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను, అధికార వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న ధోరణి మరోమారు బట్టబయలైంది. ఊహించినట్టే ఢిల్లీ మద్యం పాలసీ కేసు రాజకీయ ప్రేరేపితమైనదని తేలిపోయింది. ఆధారాలేవీ లేకుండానే కేసును అల్లారని, ఊహాగానాలతో కథ నడిపించారని పేర్కొంటూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవిత సహా 23 మందిపై పెట్టిన అభియోగాలను కొట్టివేసిన న్యాయమూర్తి జితేందర్‌సింగ్.. నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. సీబీఐకి చీవాట్లు పెట్టారు.
కేసీఆర్ గతంలోనే చెప్పినట్టు మద్యం పాలసీ కేసు ట్రాష్ అని తేలిపోయింది. అభియోగాల మబ్బుతెరలను చీల్చుకుని నిందితులు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేందుకు బీజేపీ విషపన్నాగాలు ఎలా రచిస్తుందో, వాటి ఆధారంగా నేతలకు మకిలి అంటించేందుకు ఎంతలా దిగజారుతుందో మరోమారు విస్పష్టమైంది
మద్యం పాలసీలో స్కామ్ లేదు. ఆరోపణలన్నీ ట్రాష్. బీజేపీకి కంట్లో నలుసులా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను, నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఈ కేసును అల్లారు. ఢిల్లీ రాష్ట్ర మద్యం పాలసీని స్కామ్‌గా చిత్రీకరించారు. అటు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిండ్రు. ఇటు నా కూతురిని అరెస్టు చేసిండ్రు. వాళ్లు కడిగిన ముత్యంలా బయటకు వస్తరు.
– రెండేండ్ల క్రితం మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఎటువంటి నేరపూరిత కుట్ర కాని, అక్రమాలు కాని ఉన్నట్లు సాక్ష్యాలు లేవని రౌస్ ఎవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. నిందితులపై సీబీఐ నమోదు చేసిన కేసును మూసివేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి (పీసీ చట్టం) జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. రద్దయిపోయిన ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన అవినీతి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన సీబీఐపై రౌస్ ఎవెన్యూ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సీబీఐ చేసిన కుట్ర వాదనను తోసిపుచ్చిన కోర్టు.. ఈ కేసులోని అసలు మూలాలనే ప్రశ్నించింది. సీబీఐ కథనం ఊహాజనితం. చట్టబద్ధంగా సమర్థనీయం కాదు. సాక్ష్యాల కంటే ముందస్తుగా ఊహించిన అంచనాలతో కేను నడిపారు అని న్యాయమూర్తి విమర్శించారు. కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆప్‌ను అంతం చేయడానికి మోదీ, అమిత్‌షా కుట్ర పన్నారని, కానీ న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. 2022 నాటి ఈ కేసులో అప్పటి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారులు కొందరు మద్యం తయారీదారులు, అమ్మకాల కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా మద్యం పాలసీని రూపొందించినందుకు ప్రతిఫలంగా లంచాలు స్వీకరించారనేది ప్రధాన ఆరోపణ.
సౌత్ గ్రూపు అనే మద్యం సిండికేట్ తన సభ్యులకు అనుకూలంగా మద్యం పాలసీని తయారుచేసుకునేందుకు ఆప్‌కి, దాని నేతలకు భారీగా ముడుపులు చెల్లించినట్లు సీబీఐ ఆరోపించింది. సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా పీఎంఎల్ఏ కింద మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. 2021 నవంబర్ 17న అప్పటి కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేసింది. అయితే అవినీతి ఆరోపణలు రావడంతో 2022 సెప్టెంబర్ చివరిలో ఈ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది.
ఈ ఆరోపణలన్నిటినీ తోసిపుచ్చిన ప్రత్యేక నాయమూర్తి జితేంద్ర సింగ్ వీటిపై దర్యాప్తు నిర్వహించిన సీబీఐపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీబీఐ అధికారులను ఆర్థిక నిరక్షరాస్యులుగా న్యాయమూర్తి అభివర్ణించారు. వాస్తవాలను పూర్తిగా విస్మరించినందుకు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. చట్టపరంగా ఆమోదయోగ్యమైన ఆధారాల కంటే ఊహాజనిత కథనాలపైనే ప్రాసిక్యూషన్ కేసు రూపొందించిందని కోర్టు మండిపడింది. ఒక బలమైన కథనాన్ని రూపొందించడానికి సీబీఐ యత్నించింది కాని ముందుగానే నిర్ణయించిన ముగింపునకు అనుకూలంగా అవాస్తవాల నిర్మాణం జరిగిందని తమ విచారణలో తేలినట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. సీబీఐ కథనం అతుకుల బొంతలా ఉందని, చుక్కలను పెట్టి వాటిని కలపుకుని చూడాలని కోర్టును సీబీఐ కోరుతున్నదని, దీన్ని క్రిమినల్ చట్టం అనుమతించబోదని కోర్టు పేర్కొన్నది. ఈ కేసులో సీబీఐ కథనం నిరూపించలేకపోయిన తప్పుగా, ఆర్థిక నిరక్షరాస్యతగా, చట్టబద్ధంగా నిలబడలేనిదిగా అభివర్ణించారు.
చట్టాల మౌలిక సిద్ధాంతాలపైన ఓ లెక్క ప్రకారం జరిగిన దాడిగా సీబీఐ దర్యాప్తును న్యాయమూర్తి అభివర్ణించారు. నేరం ద్వారా అక్రమ ఆదాయం ఉందనే ముందస్తు అంచనాతో దర్యాప్తు అధికారులు దర్యాప్తును కొనసాగించినట్లు కనపడుతున్నదని కోర్టు వ్యాఖ్యానించింది. నియంత్రణ, ప్రయోజనం లేదా నేరపూరిత ఉదేశాలకు(మెన్స్ రియా) ఆధారాలు లేకుండా సాధారణ ఆర్థిక లావాదేవీలను నేరంగా పరిగణించడానికి సీబీఐ ప్రయత్నించిందని కోర్టు విమర్శించింది. అనుమానాస్పదమని ముద్రవేసిన విధాన నిర్ణయాలు నిజానికి మద్యం లైసెన్సుల కోసం పోటీని బలోపేతం చేయడంతో.. సీబీఐ వాదనలోని డొల్లతనం బయటపడిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఎన్నికల కమిషన్‌కు పరిమితం చేసిన ఎన్నికల ప్రచార స్వీయ నిర్వహణ ఆడిట్‌ను సీబీఐ నిర్వహించిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభుత్వ అధికారి కుల్దీప్ సింగ్‌ను చేర్చినందుకు సీబీఐ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని కోర్టు సిఫార్సు చేసింది. న్యాయ పరిశీలనను ఎదుర్కోలేకపోయిన, అపఖ్యాతి పాలైన కేసుగా దీన్ని కోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ ఉపయోగించిన సౌత్ గ్రూపు అనే పదం పూర్తిగా ఏకపక్షంగా, పక్షపాతంతో ఉందని, దీనికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
కేజ్రీవాల్, సిసోడియా, కే కవిత, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిైళ్లె, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రు, అమన్‌దీప్ సింగ్ ధాల్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గోరంట్ల, రాజేశ్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చంద్రప్రీత్ సింగ్ రాయత్, దుర్గేశ్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశీష్ చంద్ మాథుర్, శరద్ చంద్రారెడ్డి.
హైకోర్టుకు సీబీఐ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో సీబీఐ అప్పీలు చేసింది. దర్యాప్తులోని అనేక అంశాలను కోర్టు విస్మరించిందని పేర్కొన్నది.
కోర్టు తీర్పు వెలువడిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. ఇదే కేసులో నిర్దోషిగా బయటపడిన మరో నిందితుడు, సిసోడియా రోదిస్తున్న కేజ్రీవాల్‌ను ఓదార్చారు. ఈ కేసుపై కేజ్రీవాల్ స్పందిస్తూ నేను అవినీతిపరుడిని కాను. కేజ్రీవాల్, సిసోడియా నిజాయితీపరులని కోర్టు చెప్పింది. ఈ కేసులో నిందితులందరినీ కోర్టు నేడు నిర్దోషులుగా ప్రకటించింది. ఏనాటికైనా సత్యమే గెలుస్తుందని నేను ముందు నుంచి చెబుతున్నాను.
భారతీయ న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆప్‌ని అంతం చేసేందుకు అమిత్ షా, మోదీ అతి పెద్ద రాజకీయ కుట్ర పన్నారు. మా పార్టీకి చెందిన ఐదుగురు సీనియర్ నాయకులను జైల్లో పెట్టారు. పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని ఇంట్లో నుండి బయటకు ఈడ్చి జైలుకు పంపించారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు. నా జీవితంలో నిజాయితీని మాత్రమే సంపాదించుకున్నాను’ అని పేర్కొన్నారు.