Parliament : పార్లమెంట్ (Parliament) ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు అవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండానే లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఇవాళ (సోమవారం) లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై చర్చ చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయినా ప్రతిపక్ష సభ్యులు (Oppsition MPs) ఆందోళన కొనసాగిస్తున్నారు.
దాంతో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడ్డాయి. సభలు తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో లోక్‌సభను మధ్యాహ్నం ఒంటిగంట వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదాకు ముందు విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు ఒప్పుకుని, ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.