Suleiman Shah : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) సూత్రదారి సులేమాన్ షా (Suleiman Shah) అలియాస్, మూసా ఫౌజీ (Musa Fauji) భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు. ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev) పేరుతో చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా భద్రతాబలగాలు సోమవారం మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో పహల్గాం ఉగ్రదాడి సూత్రదారి సులేమాన్ షా అలియాస్ మూసా ఫౌజీ ఉన్నట్లు బలగాలు గుర్తించాయి. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
లష్కరే తోయిబా టాప్ కమాండర్ అయిన సులేమాన్ షా పహల్గామ్ ఉగ్రదాడికి కుట్రపన్నడమే కాకుండా ఆ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని భద్రతాబలగాలకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత ఏడాది శ్రీనగర్-సోన్మార్గ్ హైవేలోని జడ్-మోర్హ్ టన్నెల్ నిర్మాణ పనుల్లో ఉన్న ఏడుగురిని హత్య చేసిన ఘటనలో కూడా సులేమాన్ ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా తాజా ఆపరేషన్ చేపట్టాయి.
ఉగ్రవాదుల నుంచి భద్రతాబలగాలు 17 గ్రనేడ్లు, ఒక M4 కార్బైన్, రెండు AK-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. శ్రీనగర్‌లోని దచిగామ్ ఏరియాలో మౌంట్ మహదేవ్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. దచిగామ్ ఏరియాలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముగ్గురిని హతమార్చాయి. జబర్వాన్, మహదేవ్ పర్వత శ్రేణుల మధ్య జరిగే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌కు మహదేవ్ అని పేరుపెట్టారు.
కాగా ఈ ఏడాది ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో మారణహోమానికి పాల్పడ్డారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడి 26 మంది ప్రాణాలు తీశారు. వారిలో 25 మంది భారత పౌరులు, ఒక నేపాలీ ఉన్నారు. ఆ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్‌లో భాగంగా పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మొత్తం 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఆపరేషన్ సింధూర్‌పై ఇవాళ లోక్‌సభలో చర్చ మొదలైంది. లోక్‌సభలో చర్చ మొదలైన రోజే పహల్గామ్ ఉగ్రదాడి సూత్రదారి ఎన్కౌంటర్లో హతమవడం గమనార్హం.