Gujarat : గుజరాత్లో దారుణం జరిగింది. ప్రేయసి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని ప్రియుడిని అడిగింది. ఇది నచ్చని అతడు ఆమెను చంపి, మృతదేహాన్ని ఊళ్లోని బావిలో పడేశాడు. మృతురాలు మైనర్ కావడం గమనార్హం. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఈ నెల 17న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు, మైనర్ యువతి ఏడాదిగా ప్రేమించుకున్నారు. వారి మధ్య బంధంతో శారీరకంగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో మైనర్ యువతి ఇటీవల గర్భం దాల్చింది.
ఈ విషయాన్ని తన ప్రియుడు రాజేష్‌కు చెప్పింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. లేకుంటే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. ఈ అంశంపై ఇద్దరిమధ్యా కొంతకాలంగా చర్చలు జరిగాయి. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని రాజేష్ ఈ విషయాన్ని తన స్నేహితుడు రాహుల్‌కు చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి యువతిని చంపాలని నిశ్చయించుకున్నారు. ఇటీవల ఆమెకు సోషల్ మీడియాలో మెసేజ్ చేశాడు. తనను ఊరి చివర రహస్యంగా కలవాల్సిందిగా చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని, ఈ అంశంపై మాట్లాడాలని రమ్మన్నాడు. ఇది నమ్మిన యువతి రాజేష్ చెప్పిన చోటుకు వెళ్లింది. అక్కడ తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగా ఆ యువతిని హత్య చేశారు. ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి చంపారు. అనంతరం యువతి చున్నీని ఆమె నడుముకు చుట్టారు. ఆ చున్నీకి ఒక పెద్ద రాయి కట్టి ఆమె మృతదేహాన్ని ఊరి చివర ఉన్న బావి నీటిలో పడేశారు.
అయితే, యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా రాజేష్‌తో ఉన్న సంబంధం గురించి తెలిసి అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ క్రమంలో అతడు తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. హత్యకు సహకరించిన స్నేహితుడు రాహుల్‌ను కూడా అరెస్టు చేశారు. యువతి మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.