– సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
బూర్గంపహాడ్, ఆగస్టు 08 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్ర సాగుతుందని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్ పాషా తెలిపారు. శనివారం బూర్గంపహాడ్ మండల కేంద్రానికి చేరుకున్న యాత్రలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ దేశంలో ప్రజా సమస్యలపై చైతన్యం కల్పించి మార్పు తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా యాత్రలో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రజలను దోచుకునే పాలన మారాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత, విద్యార్థులు చేపట్టిన ఉద్యమమే ప్రజా చైతన్యానికి నిదర్శనమన్నారు.
మండలంలో ప్రతి ఏడాది గోదావరి వరదలతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మండలాన్ని ముంపు నుంచి శాశ్వతంగా రక్షించేందుకు ఎత్తైన ప్రదేశాల్లో పక్కా ఇళ్లు నిర్మించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు భూములకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించి గిరిజన ఆదివాసీ రైతులకు హక్కులు కల్పించాలని, పోడు రైతులపై అటవీశాఖ అధికారులు నమోదు చేస్తున్న కేసులను ఉపసంహరించి రక్షణ కల్పించాలన్నారు. ఈ యాత్రలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సారెడ్డి పుల్లారెడ్డి, ముత్యాల విశ్వనాథం, మున్నా లక్ష్మికుమారి, జిల్లా కార్యవర్గ సభ్యులు మువ్వా వెంకటేశ్వరరావు(లడ్డా), జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు, నలజాల సత్యనారాయణ, మల్లికార్జున్, చారి, ముదిగొండ బాలకృష్ణ, సీనియర్ నాయకులు బర్ల వెంకటేశ్వర్లు, సిద్ధార్థ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.