Galaxy Apartment | బాలీవుడ్ అగ్రకథనాయకుడు సల్మాన్ ఖాన్ నివాసమైన ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ భద్రత కోసం అక్కడ విధుల్లో ఉన్న 41 ఏళ్ల ముంబై పోలీసు కానిస్టేబుల్ గణేష్ రైతే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ముంబై పోలీసు విభాగంలోని ఎల్ఏ-4 యూనిట్‌కు చెందిన గణేష్ రైతే, శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన తీవ్రమైన అశాంతి, ఛాతిలో అసౌకర్యంగా ఉన్నట్లు తోటి సిబ్బందికి తెలిపారు. క్షణాల వ్యవధిలోనే ఆయన ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన తోటి పోలీసులు వెంటనే ఆయన్ను సమీపంలోని భాభా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతికి గల అసలు కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
కాగా, గణేష్ రైతే గతంలో భారతీయ సైన్యంలో దేశ సరిహద్దులను కాపాడటంలో సేవలు అందించారు. ఆర్మీ సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ముంబై పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆకస్మిక మృతి కుటుంబ సభ్యులలో, తోటి పోలీసు సిబ్బందిలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తరచూ వస్తున్న బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్‌కు ప్రస్తుతం కట్టుదిట్టమైన వై-ప్లస్ (Y-plus) భద్రత కల్పించిన విషయం తెలిసిందే. ఈ భద్రతా వలయంలో భాగంగానే నిత్యం సల్మాన్ నివాసం వెలుపల పోలీసుల పహారా కొనసాగుతోంది. ఈ భద్రతా ఇబ్బందులపై గతంలో స్పందించిన సల్మాన్ ఖాన్, తనకు దేవుడిపై నమ్మకం ఉందని, ఎంత ఆయుష్షు ఉంటే అంత బతుకుతామని, చుట్టూ రక్షణ సిబ్బందితో తిరగడం ఒక్కోసారి కష్టంగా ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.