ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. ఎంత గొప్ప ప్రొడక్షన్ అయినా.. పాత్ర నచ్చకపోతే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేస్తుంది సాయిపల్లవి. ఇలాంటి ఆటిట్యూడ్ కథానాయికలకు కరెక్ట్ కాదనే వాళ్లు లేకపోలేదు. తత్ఫలితంగా విజయాలను వదలుకోవాల్సివస్తుందంటూ కొందరు అభిప్రాయపడ్డారు కూడా. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అఖండ విజయాలను అందుకుంటూ, స్థాయికి తగ్గ పాత్రలను చేజిక్కించుకుంటూ గొప్ప నటిగా ఎదురులేని కెరీర్‌ని కొనసాగిస్తున్నది కలైమామణి సాయిపల్లవి.
ప్రస్తుతం తమిళంలో ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ధనుష్‌కు జోడీ నటిస్తున్నది సాయిపల్లవి. అలాగే, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తున్నది. ఇక బాలీవుడ్లో ‘ఏక్ దిన్’ సినిమాతోపాటు, పాన్ఇండియా పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో మహాసాధ్వి సీతగా నటిస్తూ ఏ హీరోయిన్‌కీ లేని లైనప్‌తో దూసుకుపోతున్నది సాయిపల్లవి. మొత్తంగా సాయిపల్లవి కాల్షీట్స్ దొరికితే సినిమా సగం విజయం సాధించినట్టే అన్నట్టుగా ప్రస్తుతం నిర్మాతలు భావిస్తున్నారట.