Health tips : కాయగూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తాయి. వాటిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వర్షాకాలంలో మాత్రం కొన్ని రకాల కూరగాయలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తినకూడని ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలంలో కాలీఫ్లవర్ తినడం మంచిది కాదు. ఎందుకంటే తేమ కారణంగా బ్యాక్టీరియా, పురుగులు పెరిగే అవకాశం ఉంది. కాలీఫ్లవర్‌లో తేమ ఎక్కువగా ఉండటం వలన అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. అది కడుపులో ఇన్ఫెక్షన్లకు కారణం అయ్యే ప్రమాదం ఉంది.
వంకాయలలో వర్షాకాలంలో పురుగులు పడుతాయి. కోసేటప్పుడు పురుగులు కనిపిస్తే మొత్తం వంకాయను పారవేయాలి. కొన్ని పురుగులు ఉడికించిన తర్వాత కూడా జీవించగలుగుతాయి. వాటిని తింటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. టేప్‌వార్మ్ లాంటి సూక్ష్మజీవుల లార్వా మెదడులోకి ప్రవేశిస్తే అది ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుంది.
బీరకాయ వర్షాకాలంలో సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఫైబర్ పరంగా గొప్ప కూరగాయ. కానీ వర్షాకాలంలో ఇది కీటకాలతో ఉంటుంది. దానిలో ఉండే పురుగులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ పురుగులను తింటే అవి శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతాయి. ఇవి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.
క్యాబేజీ పొరల మధ్య టేప్‌వార్మ్‌లు దాక్కునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు చాలా వేగంగా పెరుగుతాయి. వాటిని శుభ్రం చేసి సరిగ్గా ఉడికించకపోతే, వాటి గుడ్లు జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి శరీరం లోపలికి, మెదడులోకి కూడా చేరుతాయి. మీరు తినాలని అనుకుంటే క్యాబేజీని ఉపయోగించే ముందు నీటిలో మరిగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాప్సికమ్ లోపలి భాగంలో టేప్‌వార్మ్‌లు ఉండవచ్చు. సరిగ్గా కడగకపోతే టేప్‌వార్మ్ గుడ్లు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి. కాబట్టి వర్షాకాలంలో పై కూరగాయల జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరైతే జాగ్రత్త శుభ్రం చేసుకుని, ఉడికించుకోవాలి.