Imran Khan : ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) నాయకులు 47 మందికి యాంటీ టెర్రరిజం కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. ఒక్కొక్కరూ 1.52 కోట్ల పాకిస్తాన్ రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. 2023లో వివిధ అభియోగాల కింద ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో ఆయన అరెస్టును నిరసిస్తూ పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ అభిమానులు పాక్ దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో 2023, మే 9న కొందరు పీటీఐ అగ్రనేతలు తీవ్ర దాడులు, హింసకు పాల్పడ్డారని పాక్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, తగలబెట్టడం, పోలీసులు, భద్రతా బలగాలపైకి దాడికి పాల్పడటం వంటివి చేశారని ప్రభుత్వం ఆరోపించింది. పాక్‌లోని జీహెచ్‌క్యూ గేట్, ఆర్మీ మ్యూజియం, మెట్రో స్టేషన్ వంటివి కూడా ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాక్ ప్రభుత్వం పలువురు పీటీఐ నేతల్ని అదుపులోకి తీసుకుంది. ఈ దాడులకు బాధ్యులుగా 47 మందిని గుర్తించింది.
వీరిపై పోలీసులు కేసు నమోదు చేయగా, పాక్‌కు చెందిన యాంటీ టెర్రరిజం కోర్టు విచారణ జరిపింది. దాదాపు మూడేళ్ల తర్వాత చివరకు 47 మంది పీటీఐ నేతలు నేరానికి పాల్పడ్డట్లు కోర్టు గుర్తించింది. ఇందుకుగాను వీరికి పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. డబ్బులు చెల్లించకపోతే, వారి స్థిర, చర ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని కోర్ట్ సూచించింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైలులో ఉన్నారు. ఆయన అనారోగ్యంపై చాలా కాలంగా వార్తలు వస్తున్నా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.