శనివారం 28 నవంబర్ 2020
Editorial - Nov 22, 2020 , 00:01:11

సహజీవన తెలంగాణ

సహజీవన తెలంగాణ

తెలంగాణ జనజీవన పతాక పాట. తరతరాలుగా ఈ ప్రాంత ప్రజల జీవితాలను ఆడించి, పాడించి, లాలించి.. నడిపించిన పాటకు సమున్నత గౌరవం దక్కింది. ఇవ్వాళ పాట పల్లకి ఎక్కింది. అయితే దానికి ఆలంబన వెంకన్న కావటం తెలంగాణ సమాజానికి ఆనందంగా ఉన్నది. ఇది వ్యక్తిగా వెంకన్నకు దక్కిన గౌరవం కాదు,పాటకు తొడిగిన కిరీటం.

కొందరు ఈ సందర్భాన్ని కూడా వంకర చూపుతో చూస్తున్నారు. వక్రీకరించి మాట్లాడుతున్నారు. రాజకీయాలతో ఆయనకు సంబంధం లేకున్నా, మలిదశ ఉద్యమం మొదలయిన నాటినుంచి నేటిదాకా, కేసీయార్‌ని బాగా అభిమానించే కవులలో ఆయన ఒకరు. కేసీయార్‌ కవులు, కళాకారులతో కూర్చున్నప్పుడు ఒక సారస్వతమూర్తిగా ఉంటారు. అందుకే ఆయన గతంలో ఏ పాలకుడూ చూడని రీతిలో పాట గొప్పదనాన్ని గుర్తించాడు, గౌరవించాడు. ఎవరేమన్నా.. ఇవ్వాళ నడిగడ్డన సాగునీరు పారుతున్నది. సస్యశ్యామలంగా పసిడిపంటలతో కాంతులీనుతున్నది. వలసల సీమ పాలమూరు పాడిపంటల నెలవైంది. వెంకన్నకు కావలసింది కూడా ఇదే. నెర్రెలు బారిన నేలలో నీటి కాలువలు పారించిన వారికి కృతజ్ఞతలు పంచడం తప్పెలా అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ‘కాళోజీ’ అవార్డు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ‘హంస’ అవార్డు, జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం లబ్దప్రతిష్టులైన కవులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘కబీర్‌ సమ్మాన్‌' అవార్డు పొందిన వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం తెలంగాణ జాతి తనను తాను సన్మానించుకోవడమే.

మనిషి పరిణామ వికాస చరిత్ర ఎంత పురాతనమైందో.. పాట పుట్టుక క్రమం అంత సుదీర్ఘమైంది. పాటనుంచి మనిషిని వేరు చేయలేం. మనిషి మనుగడ కోసం చేసే ఆరాట పోరాటాల్లోంచి, శ్రమలోంచి ఆవిర్భవించింది పాట. మనిషి దిగాలు పడ్డప్పుడు, ఓడిపోయినప్పుడు అండగా నిలిచిందీ, అశక్తుడైనప్పుడు చేయిపట్టి నడిపించిందీ పాటే. చారిత్రకంగా పాట ఆనంద, వినోద సాధనం మాత్రమే కాదు... వెలుగుబాటలేసిన చైతన్య దీప్తి. ఇది ఇక్కడే, తెలంగాణకే సొంతం కాదు, ఆదికాలం నుంచి ప్రపంచంలో ఏ మూలన ఉన్న మానవ సమూహాన్నయినా ఆ సమాజ సంస్కృతే వికాసం దిశగా నడిపించింది. దీనికి తెలంగాణ సమాజం మినహాయింపేమీ కాదు. కాకుంటే.. మరెక్కడా లేనంతగా తెలంగాణ జాతి సాంస్కృతిక ధాతువు పాటలో ఉన్నది. సారవంతమైన సాంస్కృతిక సహజీవనం కలిగిన తెలంగాణ తరతరాలుగా తనదైన విశిష్ట, మానవీయ విలువలు కేంద్రంగా ముందుకు సాగింది. ఆయా చారిత్రక సందర్భాల్లో ముందుకు వచ్చిన వైష్ణవం, శైవం, వీరశైవం మొదలు బౌద్ధ, జైన జీవన విధాన ఆచారాల దాకా మనిషికి, మానవత్వానికి పెద్దపీట వేశాయి. రాజులు మారినా, తర్వాత వచ్చిన రాజుల సంరక్షణలో మతాచార విలువలు సామాజిక జీవనంలో మనుషుల మధ్య వైరుధ్యాలు కాకుండా సంలీనం, సహజీవనం పునాదిగా పాదుకొన్నాయి. అందుకే పైపై చూపులకు, రోజువారీ జీవితంలో మతానుసరణ ఎంత వైవిధ్యంగా, వైరుధ్యంగా కనిపించినా, ఉన్నా.. అవన్నీ వారి జీవనాన్ని సారవంతం చేశాయి. ఆ సామాజిక జీవనమే వారికి సహజీవనం నేర్పింది.

ఈ సహజీవన సంస్కృతికి ప్రతీకగానే.. నేటికీ మనకు అనేకం సాక్షాత్కరిస్తాయి. కడపలోని అమీన్‌పీర్‌ దర్గాలోని ప్రధాన మౌల్వీ కాషాయ బట్టలతో దర్గా పూజలు నిర్వహిస్తాడు. తెలంగాణలో పల్లెపల్లెనా ప్రజల పండుగగా విలసిల్లుతున్న పీర్ల పండుగను హిందూ, ముస్లిం అనే మతభేదం లేకుండా ఘనంగా జరుపుకుంటారు. అలాయ్‌, బలాయ్‌లతో అన్నదమ్ముల్లా ఐకమత్యంగా నిర్వహించుకుంటారు. పీర్లకు కట్టే దట్టీలపై కూడా శంఖుచక్రం నగిశీలు తేజోవంతంగా మెరుస్తుంటాయి. పీర్లకు ఉండే మకుటాయమానమైన ‘పడిగె’ వైష్ణవానికి సంకేతంగా మూడు నిలువుబొట్లుగా నిలచి ఉన్నది. ఈ సహజీవన సంస్కృతి నేడు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. మెజారిటీ వాదం పేర, హిందుత్వం పేర మనుషుల మధ్య మత అడ్డుగోడలు లేపే ప్రయత్నాలు సాగుతున్నవి. హిందుత్వ పేరుతో, భరతమాత పేరుతో భారతీయుల మధ్య సరిహద్దులు గీసే కుట్రొకటి సాగుతున్నది. సకల ఉత్పత్తులను తమ చెమట చుక్కలతో సృష్టిస్తున్న శ్రమజీవుల నుంచి సహజీవన ‘భూమాత’ రూపును దూరం చేసేందుకు భరతమాతపేరిట ద్రోహమొకటి అందలమెక్కి వికటాట్టహాసం చేస్తున్నది. అందుకే వెంకన్న..

‘ఉత్తరాన మంచుకొండ నెత్తికొప్పు బిల్ల నీకు

కన్యాకుమారి నీ కాలి అందెలెండిపట్టి

మేటిగుళ్లు గోపురాలు మేనిసొమ్ములమ్మ నీకు

పారుతున్న జీవనదులు పట్టుచీరలమ్మ నీకు

పశ్చిమాన నీలగిరులు పరువాల నాదు కురులు

తూర్పునపొడిసె పొద్దు అమ్మ నీకు నుదుటి బొట్టు

వందకోట్ల తల్లివమ్మ అమ్మ భారతమ్మ

చందనాల గండమేను అమ్మా భారతమ్మ

నీకు లోకమంత వందనాలు అమ్మా భారతమ్మ ..’

అని కైత కట్టాడు. అలాగే, తెలంగాణ ప్రజల సహజీవనానికీ, మతసామరస్యానికీ ప్రతీకగా..

‘దూల దూలకాశిమా దుమ్ములేపు కాశిమ

దుమ్ములేపు కాశిమా దూలాడు కలిసి కాశిమ

ఎరుపుదట్టి పచ్చదట్టి ఎన్నెల గులాబి దట్టి

తళుకు తళుకుముడుపులుట్టి కుడకలబెల్లంపట్టి

వెండికంటెలెన్నొగట్టి ఊరే హారతిపట్టె

మల్లెసిగల ఊదుపొగల ఊరేగే పీరుమహిహ

మతభేదం కులభేదం మరిసికలిసె మన ఊరు

పండుగ పబ్బం గుండెల సందడి ఈ మొహరం

వందలేండ్ల నుంచి పల్లెనొకటి చేసె సంబరం..’ 

అని కులమతాలకు అతీతంగా తెలంగాణ పల్లెల్లో ఉన్న సహజీవన సౌందర్యాన్ని చెప్పాడు. శతాబ్దాలుగా చెక్కుచెదరని తెలంగాణ పల్లె సహజీవనంలో చిచ్చు రేపటానికి మతాన్నీ, భక్తి- ముక్తినీ ముందటేసుకొని ఓ మత రాజకీయం దూసుకువస్తున్నది. మనుషులను విడదీసి, మనుషుల మధ్య రక్తపుటేరులు పారించి అధికార పీఠాలెక్కడం కోసం అర్రులు చాస్తున్నది. అందుకే, మతమౌఢ్యంగాళ్లు చేస్తున్న గారడీల గురించి...

‘ఎంతకుతెగించితివేర ఓ మతోన్మాది

పంతమున పగ రేపితివి ఓ మతోన్మాది

రామజన్మభూమి రంకు బొంకు లెన్నొ అన్ని

పుల్లవెట్టి లొల్లిలేపి కల్లోలం కదనుజూపి

నెత్తురు మరిగిన రక్కసి మత భూతంబుల లేపి

కత్తుల కోలాటమాడినవు ఓ మతోన్మాది

నెత్తురులో తానమాడినవు..’ 

అని మతవాదుల కుట్రలను చెప్తూనే, తుర్క రాజులే దేవాలయాలను కూలగొట్టారని చెప్పే విషప్రచారాన్ని కూడా తన తొలిరచనల్లో ప్రశ్నించాడు.

‘గుడి దాడులు తురకరాజులొక్కరెవడి గట్టలేదు

మతిచెడి గతరాజులు మంటకలిపెరెన్నో గుడులు

బుద్ధుని ఆరామాలు భూమినిండ శిథిలాలు

లెక్కదీసి మరల గడితె రాముని తావే మిగలదు

సేదు నిజం నీకు తెలవదా ఓ మతోన్మాది..’ 

అని చరిత్ర చీకటి కోణాలను విప్పిచెప్పాడు.

సర్వంతర్యామి, నిర్గుణుడు, నిరాకారుడైన దేవుడు ఫలానా చోటనే ఉన్నాడన్న మతోన్మాదుల నీతిమాలిన చర్యలను ఎండగట్టినాడు.

‘వేలకొలది రామగుళ్లు వెలిసెను దేశం నిండ

దీపారాధన నోయని సీకటిశిథిలాలయములు

భక్తి నీకు నిజంగుంటె తిరిగి తిరిగిభజియించుకో

దేవుడైతె రాముడు మరి భూమిలంతఉంటడు గద

ఎరిగి ఎరిగి తురుకలమసీదులెందుకు పుడ్తడు

నీది భక్తి కాదు ముక్తికాదురో ఓ మతోన్మాది

భట్టెబాజి కుతంత్రంబులో ఓ మతోన్మాది..’ 

అని దేవుని పేర, మతం పేర మంటలు రేపుతున్న కపటదారుల కుయుక్తులను బట్టబయలు చేశాడు. ఇక్కడే ఇంకో విషయం చెప్పుకోవాలి. నేడు కపటనీతితో బయలుదేరిన కాషాయధారులు హిందుత్వం తమ గుత్తసొత్తు అయినట్లుగా మాట్లాడుతున్నారు. వారు చెప్పే చాతుర్వర్ణ వ్యవస్థ, నిచ్చెనమెట్ల వివక్షపూరిత కులవిభజనతోనే హిందుత్వ ఉనికికి ప్రమాదం తెచ్చిపెట్టారు. మనుషులంతా సమానులే, అన్నదమ్ములే అన్న వసుధైక కుటుంబభావన చెప్పిన భారతీయ తత్వానికి తూట్లు పొడిచి, వెన్నుపోటు పొడిచింది వారే. గతంలోనూ ఇదే జరిగింది, ఇప్పుడూ అదే చేస్తున్నారు. కానీ నిజానికి ఈ హిందుత్వ భావన జనబాహుళ్యంలోనే, గ్రామీణ శ్రమజీవులతోనే, వారిలోనే బతికింది, బతుకుతున్నది. ఉన్నదాంట్లో సగంపెట్టి తోటి మనిషి ఆకలి తీర్చమన్న భావనకు తిలోదకాలిచ్చి అంతా పోగేసుకో.. అందరిని అణగదొక్కి అందలమెక్కు అన్న నీతిని పాటిస్తున్నవారు హిందువులు కానేకాదు. హిందుత్వ ద్రోహులు. 

దేశ ప్రజల చెమట చుక్కలతో రూపుదిద్దుకున్న ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ అంబానీ, అదానీ లాంటి  కంపెనీ యజమానులకు అప్పనంగా కట్టబెడుతున్న వారు దేశభక్తులు ఎలా అవుతారు? 40 కోట్ల దేశ ప్రజల జీవన భద్రతకు భరోసాగా నిలుస్తున్న ఎల్‌ఐసీని ప్రైవేటుపరం చేసేటోడు ప్రజల బాగోగులు చూసేటోడు ఎలా అవుతాడు? రక్షణరంగ ఉత్పత్తులను సైతం ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేటోడు దేశ రక్షకుడు ఎలా అవుతాడు? 

భారతీయ చరిత్రలో ఉత్కృష్ట పాత్ర పోషించిన లౌకిక, లోకాయత, చార్వాక, తర్క తత్వవిచారాన్ని కూడా నేటి మత రాజకీయులు సహించటం లేదు. గౌరీలంకేశ్‌, పన్సారే, దభోల్కర్‌ లాంటి నాస్తిక హేతువాదులను మధ్యయుగాల రాక్షసత్వంతో హత్యచేశారు. దేశ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వారందరిపై ఈ నకిలీ, మకిలీ దేశభక్తులు దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. జైళ్లో నిర్బంధిస్తున్నారు. సుధా భరద్వాజ్‌, ఆనంద్‌ తెల్‌తుంబ్లే లాంటి అంతర్జాతీయ మేధావులను, రచయితలను, కళాకారులను దేశద్రోహులుగా ముద్రవేసి హింసిస్తున్నారు. ఏండ్ల తరబడి జైళ్లలో పెడుతున్నారు. తరతరాల భారతీయ జీవనంలో నెలకొన్న సహనం, శాంతి విలువలకు పాతరేస్తున్నారు.

వర్తమాన విషయానికి వస్తే.. ఇలాంటి మకిలీ హిందుత్వవాదులు ఇవ్వాళ తెలంగాణపై కన్నేశారు. మత సామరస్యానికి పెట్టని కోటయైన తెలంగాణలో పాగా వేయజూస్తున్నారు. మతకలహాల మంటలు రేపి చలికాచుకునేందుకు చెత్తా చెదార భావజాలాన్ని పోగుజేస్తున్నారు. తరతరాల సహజీవనానికి తెలంగాణ సంకేతం. ఇహలోక భోగభాగ్యాలను వదిలి రాగబంధాలను తెంచుకుని జనులందరి సౌఖ్యం కోసం సూఫీ గురువులు, బైరాగులు.. నడయాడిన నేల ఇది. అచల పీఠాలు, రాజయోగ పీఠాలతో వెంకన్నకు అనుబంధం వుంది. విశ్వద్దీన్‌, బందెనవాజ్‌, అహ్మదుద్దీన్‌, అల్లాజీ, కిషన్‌, దున్న ఇద్దాస్‌ లాంటి జ్ఞానబోధకుల క్షేత్రాల్లో తన గాత్రాన్ని, కవనాన్ని సానబెట్టుకున్నవాడు వెంకన్న. ఒకచేత అష్టాక్షరి, మరొకచేత ఖురాన్‌ పట్టుకొని తిరిగి జనులందరి మేలుకోసం జీవితాన్ని అర్పణం చేసిన మల్కీదాసు, కాశిదాసు, బాలకిషన్‌ లాంటి ప్రబోధకుల జ్ఞానమార్గంలో సాగే వెంకన్న తెలంగాణ తాత్త్విక గేయాలకు చిరునామాగా నిలిచాడు. నేటికీ తమ ప్రబోధాలతో నడిగడ్డ ఈశ్వర్య, చింతలదిన్నె హనుమంతరెడ్డి, రామచంద్ర ప్రభులాంటి వాళ్ల బోధనాశ్రమాలలో తిరుగాడే వెంకన్న పాటలలోని మతసామరస్యం, శాస్త్రీయ దృష్టి, కరుణ, జాలి, దయ, క్షమ లాంటి భావాలకు కవిత్వరూపమద్ది, వల్లంకితాళమై ఈ లోకాన్ని చిందేయిస్తున్నాడు. అమానవీయం ఏ రూపంలో ఉన్నా, వచ్చినా నిరసిస్తున్నాడు. సహజీవన సంస్కృతికి హాని తలపెట్టే ఎలాంటి కుట్రలనైనా తెలంగాణ సమాజం నిలువరిస్తుంది. ఆ పరిస్థితే ఉత్పన్నమైతే.. ఒకనాడు ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ అని జాగృతం చేసిన పాట, మళ్ళీ తన కర్తవ్యాన్ని భుజానికెత్తుకుంటది. ‘మమతలు గల్ల పల్లెలోకి మతరక్కసిరావొద్దని..’ ఏకునాదంమోతై మోగుతది. సకల జనులను మతోన్మాదంపై పోరుకు సన్నద్ధం చేస్తది. 

‘సమత ఆకాశపు దీపానివి వీరుడా సమరశంఖానికి ఊపిరివి ధీరుడా..’ అంటూ పాట ఉప్పెనై లేస్తది. చరిత్రలో పాట చేసిన పని ఇదే. ఆనందమై ఆటకు అడుగులైన పాట, అవసరమైనప్పుడు ఆయుధమై జయకేతనమవుతుంది.

-స్వరూపి