ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Sep 02, 2020 , 10:03:13

ప్రమాదకర పోకడ

ప్రమాదకర పోకడ

‘నీకు ఆకలి కాకుండా మందు ఇస్తా.. నీ సద్ది మూట నాకివ్వు’ అన్నట్టుగా ఉన్నది మొదటి నుంచి జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి. సద్ది మూట గుంజుకున్నది.. ఇప్పుడు ఆకలి తీర్చుకోవడానికి అప్పు తీసుకోమంటున్నది! జీఎస్టీ పేరుతో రాష్ర్టాలు పలు పన్నులను కోల్పోవలిసి వచ్చింది. ఇది రాష్ర్టాల హక్కులకు వ్యతిరేకంగా ఉందనేది కూడా తెలిసిందే. అయినా దేశవ్యాప్తంగా ఏకరూపత ఉండాలనే వాస్తవాన్ని గ్రహించి రాజీ పడవలసి వచ్చింది. రాష్ర్టాలు సమ్మతించినందుకు కేంద్రం తనవంతుగా హామీ ఇచ్చింది. 2016-17ను ప్రాతిపదికగా తీసుకుంటూ వార్షిక పెరుగుదలను 14 శాతంగా గుర్తించి, జీఎస్టీ వసూళ్ళు ఎంత ఉన్నప్పటికీ, 2002 వరకు రాష్ర్టాలకు పరిహారం ఇస్తామని కేంద్రం చట్టరూపకంగా హామీ ఇచ్చింది. ఆ క్రమంలోనే పరిహార సెస్‌ ఏర్పాటయింది. కేంద్రం ఆ మాట మీద నలబడటం గౌరవప్రదంగా ఉంటుంది.

 కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలో దేశవ్యాప్త సమతుల అభివృద్ధి బాధ్యతను కేంద్రమే తీసుకోవలసి ఉంటుంది. లేదా ఆర్థిక, పాలనాపరమైన వికేంద్రీకరణ జరుగాలి. కానీ కేంద్ర ప్రభుత్వ ధోరణి ఎటూ కాకుండా ఉన్నది. పైకి పాక్షిక సమాఖ్యగా చెప్పుకుంటున్నప్పటికీ, మన దేశంలో ఇప్పటికే పలు వ్యవస్థలు కేంద్రీకృత స్వభావాన్ని కలిగిఉన్నాయి. కీలక సమయంలోనైతే దేశం పూర్తి కేంద్రీకృత లక్షణాన్ని సంతరించుకుంటున్నది. ఇటీవల కరోనా వైరస్‌ సమస్య ముందు కొచ్చినప్పుడు కేంద్రం చలాయించిన పెత్తనం పరిశీలించదగినది. ఈ నేపథ్యంలో జీఎస్టీ కూడా కేంద్రీకృత వ్యవస్థను బలపరిచేదిగానే ఏర్పడింది. ఈ తిరోగమన విధానం కనబడకుండా ఉండాలంటే కేంద్రం ఉదాత్తంగా వ్యవహరించి సముచిత సంప్రదాయాలను నెలకొల్పాలి. 

కేంద్రం అనుసరిస్తున్న విధానం మూలంగా రాష్ర్టాలకు, సమాజానికి హాని కలుగుతుంది. వనరుల సమీకరణ సామర్థ్యాలను కేంద్రం తన వద్ద పెట్టుకుంటున్నది. సామాజిక - ఆర్థిక పరివర్తన బాధ్యత రాష్ర్టాల మీద ఉన్నది. దీని వల్ల క్రమేణ రాష్ర్టాలకు నిధుల కొరత తీవ్రమవుతుంది. జీఎస్టీ రూపకల్పనే సమాఖ్యతత్వాన్ని దెబ్బతీసేదిగా ఉన్నది. దీంతో రాష్ర్టాల వనరుల సేకరణ వ్యవస్థ దెబ్బతింటున్నది. భిన్నత్వం గల మన విశాల దేశంలో ఇప్పుడిప్పుడే వివిధ జాతులు, తెగలు అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నాయి. ఈ దశలో రాష్ర్టాలు బలహీనపడటం కానీ సంక్షేమ పాలన దెబ్బతినడం కానీ వాంఛనీయం కాదు. రాష్ర్టాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోక పోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత  దెబ్బతింటుంది. కేంద్ర ప్రభుత్వం కేవలం ఆర్థిక దృష్టితో ఈ అంశాన్ని చూడగూడదు. తమ విధానాలు తక్షణం, దీర్ఘకాలికంగా ఏ పరిస్థితులకు దారితీస్తాయో విజ్ఞతతో అర్థం చేసుకోవాలి.   


logo