బుధవారం 03 జూన్ 2020
Business - Apr 21, 2020 , 23:59:38

మార్కెట్లకు క్రూడ్‌ సెగ

మార్కెట్లకు క్రూడ్‌ సెగ

  • సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లు డౌన్‌ 
  •  280 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 
  • రూ.3.30 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై, ఏప్రిల్‌ 21: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు చమురు సెగ గట్టిగానే తగిలింది. కరోనా వైరస్‌తో తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగుతున్న సూచీలకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ పాతాళంలోకి పడిపోవడంతో సూచీలు భారీ నష్టాలపాలయ్యాయి. ప్రారంభం నుంచే నష్టాల బాటపట్టిన సూచీలకు గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు ఈ పతనానికి ఆజ్యంపోశాయి. ఆర్థిక, మెటల్‌, ఇంధనం, వాహన రంగ షేర్లు కుదేలవడంతో 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ మూడు శాతానికి పైగా కోల్పోయి 31 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 1,011.29 పాయింట్లు లేదా 3.20 శాతం కోల్పోయి 30,636.71 వద్ద ముగిసింది. 30,836 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఒక దశలో 30,900 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 280.40 పాయింట్లు(3.03 శాతం) పతనం చెంది 8,981.50 వద్ద స్థిరపడింది. 30 షేర్ల ఇండెక్స్‌లో 27 షేర్లు పత నం చెందగా, కేవలం మూడు షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి.  దీంతో మదుపరుల సంపద రూ.3.30 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.3,30,408.87 కోట్లు తగ్గి రూ.1,20, 42,172.38 కోట్లకు పడిపోయింది. 

కుదేలైన ఆర్థిక రంగ షేర్లు

ఆర్థిక  రంగ షేర్లు కుదేలయ్యాయి.  ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 12 శాతం పతనం చెంది టాప్‌ లూజర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫైనాన్స్‌ 9 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 8 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 7.6 శాతం, టాటా స్టీల్‌ 7.11 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 6.63 శాతం, మారుతి 6.07 శాతం, ఎల్‌అండ్‌టీ 4.96 శాతం, టీసీఎస్‌ 4.48 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 4 శాతం, ఎస్బీఐ 3.97 శాతం, టైటాన్‌ 3.97 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 3.41 శాతం, అల్ట్రాటెక్‌ 3.06 శాతం, ఇన్ఫోసిస్‌ 3.04 శాతం పతనం చెందాయి. వీటితోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌లు కూడా క్షీణించాయి. కానీ, భారతీ ఎయిర్‌టెల్‌, హీరో మోటోకార్ప్‌, నెస్లే ఇండియాలు మాత్రం లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంకిక్స్‌, మెటల్‌, ఆటో, ఫైనాన్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ రంగ సూచీలు ఆరు శాతం వరకు కోల్పోగా.. టెలికం, హెల్త్‌కేర్‌ రంగ సూచీలు రెండు శాతం వరకు పెరిగాయి.  

చమురు రంగ షేర్లు కూడా..

చమురు ధరలు భారీగా పతనమవడంతో ఈ రంగ షేర్లు 7 శాతం వరకు  దిగువకు పడిపోయాయి. అత్యధికంగా గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌ 7.09 శాతం, ఓఎన్‌జీసీ 6.48 శాతం, గెయిల్‌ 5.72 శాతం, ఇంద్రప్రస్థా గ్యాస్‌ 2.22 శాతం, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీలు ఒక్క శాతానికి పైగా కోల్పోయాయి. ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలైన ఐవోసీ 5.31 శాతం, బీపీసీఎల్‌ 3.53 శాతం, హెచ్‌పీసీఎల్‌ 5.06 శాతం పతనం చెందాయి. 

రూపాయిది అదే దారి

దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ మరింత బలపడటం, మరోవైపు ఈక్విటీలు కుదేలవడంతో కరెన్సీ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఫలితంగా ఫారెక్స్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 30 పైసలు కోల్పోయి 76.83 వద్దకు జారుకున్నది. చమురు ధరలు పాతాళంలోకి పడిపోవడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించారు. దీంతో ఈక్విటీలతోపాటు కరెన్సీలు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. 


logo