సోమవారం 18 జనవరి 2021
Zindagi - Nov 26, 2020 , 00:36:45

సమానత్వం ఇప్పట్లో రాదు

సమానత్వం ఇప్పట్లో రాదు

ఆమె ఒక నటి. అంతకన్నా గొప్ప సామాజిక వేత్త. వివక్షను నిలదీసే వ్యక్తి. సమానత్వం కోసం పోరాడుతున్న శక్తి. ఇంతి సమస్యలపై తన గళం వినిపించడానికి ఎప్పుడూ ముందుంటారు నటి నందితా దాస్‌. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన ఆమె అనేక అంశాలపై స్పందించారు. మహిళలు ఇప్పుడున్న దానికన్నా మెరుగైన సమానత్వం సాధించాలంటే ఇంకో ముప్పయ్‌ ఏండ్లు అయినా పడుతుందని అంటున్న నందిత మనసులోని భావాలు ఆమె మాటల్లోనే...

మనిషి మనుగడకు మూలమైన భూమిని.. భూమాతగా పూజిస్తారు. కానీ మన చుట్టూ ఉన్న ఆడవాళ్లను మాత్రం ఎన్నోరకాల వివక్షకు గురిచేస్తారు. రంగు, రూపం, సామర్థ్యం పేరుతో ఎప్పుడూ చులకన చేస్తారు. ఆడదంటే ఇంట్లోనే ఉండాలి.. ఇంటిపనే చేయాలి అనే ఆంక్షలు పెట్టి వంటింటి కుందేలును చేస్తారు. అయితే ఈ పరిస్థితి ఒకప్పటికంటే కాస్తంత మెరుగ్గా ఉన్నా, పూర్తి సమానత్వం మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇంటి నుంచి బయటికొచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మహిళలే కాదు.. ఇంట్లో ఉంటున్న ఆడవాళ్లు కూడా హింస, వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. 

లాక్‌డౌన్‌ వెనక్కి నెట్టింది

లాక్‌డౌన్‌ సమయంలో సమాజంలో కనిపించిన వివక్ష నన్ను కలచివేసింది. ముఖ్యంగా వలస కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా అనిపించింది. కూటి కోసం, కూలి కోసం సొంతగూటిని వదిలేసి వచ్చినవాళ్లపై అంత తీవ్రమైన వివక్ష చూపించారు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా సహాయం చేయకపోగా.. వాళ్ల ద్వారా ఎక్కడ కరోనా వైరస్‌ వ్యాపిస్తుందోనని దూరం పెట్టారు.  అంతేకాదు, ఈ లాక్‌డౌన్‌లో గృహహింస కేసులు పెరిగాయి. ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళలపై గృహహింస అధికమైందని లెక్కలు చెబుతున్నాయి. ఇల్లు అనేది ఎవరికైనా ప్రశాంతంగా ఉండే ప్రదేశం. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వైరస్‌ని రాకుండా చేస్తుందేమో కానీ, ఆడవాళ్లపై హింసను మాత్రం ఇంకా ఇంకా పెంచుతున్నది. రాజ్యాంగం స్త్రీ, పురుష సమానత్వంపై గ్యారెంటీ ఇచ్చినా.. అది రాతలకే పరిమితమైంది. ఆచరణలో ఆమడదూరమే!

పెంపకంలో మార్పు రావాలి

ప్రతి తల్లిదండ్రులూ ఆడ, మగ తేడా లేకుండా పిల్లల్ని పెంచాలి. ఆడపిల్లల్లో తల్లులు ఆత్మైస్థెర్యాన్ని నింపాలి. మగపిల్లలకు ఆడవాళ్లను తమతో సమానంగా చూడటం అలవాటు చేయాలి. ఏది మంచి, ఏది చెడు అన్నది పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.

హైదరాబాదీలు చాలా ఫ్రెండ్లీ

నాకు హైదరాబాద్‌ అంటే ప్రత్యేక అభిమానం. ఇక్కడికి రావడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోను. నేను నటించిన ‘విరాటపర్వం’ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌కి చివరిసారిగా వచ్చాను. ఇక్కడి మనుషులు నన్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. ఇక్కడి ఫుడ్‌ని నేను చాలా ఇష్టపడుతాను.