e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021

వడ.. దడ

వడ.. దడ

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్‌ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నిప్పుల కొలిమిలా మారిన వాతావరణంతో జనం విలవిలలాడుతున్నారు. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నది. గత ఐదేండ్లతో పోలిస్తే ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఏప్రిల్‌ మొదటి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మే నెలలో ఉండే ఉష్ణోగ్రతలను తల్చుకుని జిల్లా ప్రజానీకం ఆందోళన చెందుతున్నది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో సూర్యప్రతాపం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. ఏప్రిల్‌, మే నెలల్లో 42 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో సైతం ఉష్ణోగ్రతలు గణనీయ స్థాయిలోనే ఉంటుండటంతో ఓ పక్క వేడితో.. మరోపక్క ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఉద్యోగులతోపాటు వ్యాపార వర్గాలు సైతం ఆందోళన చెందుతున్నారు.

మండుతున్న ఎండలతో తగ్గిన జనసంచారం..
గతేడాది వేసవితో పోలిస్తే ఈసారి భానుడి భగభగలు పెరుగుతున్నాయి. దీనికితోడు వేడిగాలులు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. మధ్యా హ్నం వేళలో జనం భయటికి రాకపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలను సైతం ప్రస్తుత ఎండలు కంగారు పెట్టిస్తున్నాయి. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులతోపాటు వివిధ పనుల కోసం బయటకు వెళ్లిన వారు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్తున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది ఇండ్లల్లో ఉండటంతో ఎండల ప్రభావం నుంచి కాపాడుకోగలిగారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. గత ఏడాది వర్షాలు బాగా కురవడంతో చెరువులు, కుంటల్లో మండు వేసవిలోనూ నీరు పుష్కలంగా ఉన్నది. దీంతో ఈసారి ఎండలు తక్కువగా ఉండొచ్చని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

శీతల పానీయాలకు పెరిగిన గిరాకీ

గత వారం రోజులుగా బానుడు ఉగ్రరూపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 8 నుంచే ఎండలు మండుతుండటంతో ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వస్తున్న వారు ఎండల వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు చెరకు రసం, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ రసం లాంటి శీతల పానీయాలను సేవిస్తున్నారు. ఉదయం 11 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ ముఖ్యమైన పనిమీద బయటికి వెళ్తున్న వారు తలపాగా, టోపీలాంటివి ధరించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా రోజుకు కనీసం 4 నుంచి 5లీటర్ల నీటిని తాగాలని పేర్కొంటున్నారు.

కూలర్లు, ఫ్రిజ్‌లకు భలే గిరాకీ..
ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కూలర్లు, ఫ్రిజ్‌లను కొనుగోలు చేస్తుండటంతో వాటికి గిరాకీ పెరిగింది. ఆర్థిక పరిస్థితిని బట్టి కొందరు ఎయిర్‌ కూలర్లు, ఏసీలను కొనుగోలు చేస్తే.. మరికొందరు ఫ్యాన్లు, కూలర్లు, మట్టి కుండలను కొనుగోలు చేస్తున్నారు. కొందరు మూలన పడేసిన కూలర్లు తీసి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో సర్వీసింగ్‌ సెంటర్లకు సైతం జనం తాకిడి పెరిగింది. ప్రస్తుతం ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రతి ఇంట్లోనూ కూలర్లు, ఫ్రిజ్‌లు, మట్టికుండలు నిత్యావసర సరుకుల సరసనా చేరిపోతున్నాయి. శీతల పానీయాలు, జ్యూస్‌ సెంటర్లకు సైతం గిరాకీ పెరగగా, కొబ్బరి బొండాలు, పుచ్చకాయల అమ్మకాలు సైతం గణనీయంగా పెరిగాయి. మరోపక్క వైన్‌ షాపుల్లో బీర్ల అమ్మకాలు పెరిగాయి.

ఇవీ కూడా చదవండి..

ఆరేళ్ల పిల్లాడు అద్భుతాన్ని క‌నిపెట్టాడు

భిన్నంగా పురుషులు, మహిళల మెదళ్లు.. ఎందుకో తెలుసా..?

ఓసీడీ కార్డు ఉంటే చాలు: నో నీడ్ ఓల్డ్ పాస్‌పోర్ట్‌!

అలుపెరుగని అధికారి : 90 ఏండ్లు దాటినా యూనిఫాంపై తగ్గని మమకారం‌!

హెల్త్‌కేర్‌ కోసం భారతీయ అమెరికన్ దంపతులు రూ.కోటి విరాళం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వడ.. దడ

ట్రెండింగ్‌

Advertisement