న్యూయార్క్ : నిత్యం ఒత్తిళ్లు, శారీరక శ్రమతో కూడిన పోలీస్ ఉద్యోగం అంటే ఎవరైనా 60 ఏండ్లు వచ్చీరాగానే రిటైర్మెంట్ కోసం సిద్ధమవుతుంటారు. 65 ఏండ్లు దాటినా ఆరోగ్యం సహకరిస్తే కొందరు పోలీస్ అధికారులు సర్వీసులో కనిపిస్తుంటారు. మరి ఇప్పుడు మనం చెప్పుకునే పోలీస్ అధికారి మాత్రం పోలీసులకే కాదు ప్రజలందరికీ ఓ రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. త్వరలో 92వ ఏట అడుగుపెడుతున్న స్మిత్ ఇంకా రిటైర్మెంట్ గురించి ఆలోచనే చేయడం లేదని చెబుతున్నారు.
56 ఏండ్ల సుదీర్ఘ పోలీస్ కెరీర్లో అందరి మన్ననలు అందుకున్న స్మిత్ పదవీవిరమణ ప్రణాళికలేమీ ఇప్పట్లో లేవని తేల్చిచెప్పారు. అర్కాన్సాస్లో పనిచేసే స్మిత్ 46 ఏండ్ల పాటు డిప్యూటీ షెరీఫ్గా పనిచేసిన అనంతరం ఒకసారి రిటైర్ అయ్యారు. పదవీవిరమణ చేసిన కొద్దిరోజులకే తాను ఇంటికి పరిమితం కాకూడదని నిర్ణయించుకుని తన స్వస్ధలం కాండెన్లో తిరిగి పోలీస్ అధికారిగా చేరారు. ఇక ఈ ఏడాది మేలో ఆయన తన 92వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు.
ఆ భగవంతుడు ఎప్పుడు చెబితే తాను అప్పుడే రిటైరవుతానని అప్పటి వరకూ విధి నిర్వహణలో నిమగ్నమవుతానని స్మిత్ చెప్పుకొచ్చారు. కాండెన్లో ప్రతిఒక్కరూ స్మిత్‌ను ఇష్టపడుతుంటారు. మరికొందరైతే ఆయనతో మాట్లాడేందుకు వీధుల్లో ఆగి మరీ పలకరిస్తుంటారు. పోలీస్ ఉద్యోగంపై మమకారం పెంచుకున్న స్మిత్ 1960ల్లో ఈ వృత్తిలో అడుగుపెట్టారు. వృత్తిలో చేరిన కొన్నేండ్లకే అంకితభావంతో కష్టించి పనిచేసే అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఇక వీక్ ఆఫ్ రోజు స్మిత్ తన భాగస్వామితో విలువైన సమయాన్ని ఆస్వాదించడంతో పాటు స్ధానిక చర్చిలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల ఆసక్తి కనబరుస్తారు.