Dasyam Vinay Bhasker | కాజీపేట : కాజీపేట పట్టణ నడిబొడ్డులో ఉన్న వైఎస్సార్ నగర్ కాలనీలో గత 20 ఏళ్లుగా నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న భూమిని కబ్జా చేసేందుకు కన్నేసిన రాబంధువులను అడ్డుకుంటామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. కాజీపేటలోని వైయస్సార్ నగర్ గుడిసెలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన సోమవారం పరిశీలించారు. గుడిసె వాసుల సమస్యలను అడిగి తెలుసుకొని వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. షాపూర్ ఇరాని కుటుంబ సభ్యులంటూ కొందరు వచ్చి ఈ భూమిని మింగాలని చూస్తున్నారన్నారు. ఆ భూమిపై కన్నేసిన కాంగ్రెస్ నాయకులు, అనుచరులు పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. నిరుపేదలు ఇక్కడ 2005 నుంచి గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారన్నారు.
ఎస్ఎస్ఎస్ కాంప్లెక్స్ నిర్మాణం, ఆ భూమిపై కోర్టు కేసులో ఉన్నదని తెలిసిన కాంప్లెక్స్‌కు 3 సంవత్సరాల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చిందన్నారు. కొంత మంది ఆ భూమికి దొంగ పేపర్లు పుట్టించి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల వచ్చిన కోర్టు తీర్పుతో ఆ భూమి ముమ్మాటికి ప్రభుత్వం స్థలంగా భావించ వచ్చునన్నారు. ఈ కాలనీలో నివాసం ఉంటున్న వారికి ఇంటి నంబర్లు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి, ఖాళీ చేయాలని పేదలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ భూమిని మింగడానికి కాంగ్రెస్ నాయకులు శత విధాలుగా ప్రయత్నాలు చూస్తు న్నారని ఆయన వాపోయారు. ఇప్పటికే ఈ భూమి కోసం దాదాపు 30 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పారు.
గతంలో ఎన్నిక సమయంలో రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రభుత్వ భూమిని కేటాయిస్తే మాపై కేసులు నమోదు అయ్యాయని, ఆ కేసులను కోర్టు కొట్టి వేసిందని వివరించారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాక్షసులు, రాబందులు ప్రభుత్వ భూమిపై కన్ను వేశారని తెలిపారు. అక్రమంగా నిర్మిస్తున్న కాంప్లెక్స్ నిర్మాణానికి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఎలా ఎన్ఓసి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం గుడిసె వాసుల విషయంలో పోలీసులు అత్యుత్సా హం చూపిస్తున్నా రని, గుడుసెవాసులు మాపై కొంతమంది గుండాలు దౌర్జన్యం చేస్తున్నారనికంప్లైంట్ ఇస్తే ఇచ్చిన వారి పైనే స్థానిక పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు.
బిఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన ఉండి పోరాటం చేస్తుందన్నారు. అవసరం ఐతే న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ నగర్ లో నివాస ముంటున్న పేద వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, మిగిలిన భూమిలో ప్రభుత్వ కార్యాలయలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.