Irumudi | మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంటున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా.. వరుసగా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే తొలి వీకెండ్లోనే రూ.80 కోట్ల గ్రాస్ మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న ప్రాంతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా.. తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ‘ఇరుముడి’ 2026లో విడుదలైన తెలుగు సినిమాల్లో తొలి ఆదివారం అత్యధిక మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చిన చిత్రంగా నిలిచింది. ఫుట్‌ఫాల్స్ పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డు నమోదు చేయడం ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యంగా ఈ ఘనతను టికెట్ ధరల పెంపు లేకుండానే, అలానే హాలీడేస్ కూడా లేని సమయంలో ఈ ఘనత సాధించడం విశేషం. సాధారణ టికెట్ ధరలతోనే ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు రావడం ‘ఇరుముడి’పై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీ ‘ఇరుముడి’కు ప్రధాన బలంగా మారింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు సిఫార్సు చేయడంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో కేవలం ఓపెనింగ్ వీకెండ్‌కే పరిమితం కాకుండా.. లాంగ్ రన్‌లోనూ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వరుస రికార్డులతో దూసుకుపోతున్న ‘ఇరుముడి’.. రవితేజ కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే దిశగా పయనిస్తోంది. ఇప్పటికే ఓపెనింగ్ వీకెండ్లో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. సోమవారం నుంచి కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోరును కొనసాగిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకుల సపోర్ట్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని బాక్సాఫీస్ మైలురాళ్లను అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఇరుముడి’ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఎమోషన్, యాక్షన్ అంశాలను సమతూకంగా మేళవిస్తూ ఆయన తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రవితేజతో పాటు సినిమాలో సాయి కుమార్, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర కీలక పాత్రలు పోషించారు.మొదటి వీకెండ్లోనే రూ.80 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం, ఇప్పుడు 2026లో అత్యధిక తొలి ఆదివారం ఫుట్‌ఫాల్స్ నమోదు చేసిన తెలుగు చిత్రంగా నిలవడం ద్వారా ‘ఇరుముడి’ బాక్సాఫీస్ రన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.