Crime news : కులాంతర వివాహానికి అడ్డొస్తున్నారని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గతంలో తల్లిదండ్రులను హత్యచేసిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శాంతినగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యాచారానికి చెందిన నక్కలి దశరథం (58), లక్ష్మి (54) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. మూడో కుమార్తె సురేఖ (25) మినహా అందరికీ పెళ్లిళ్లయ్యాయి. సురేఖ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.
ఆమెకు ఏడాది కిందట సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు (డ్రైవర్) ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. సురేఖ ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. కులాలు వేరు కావడంతో తీవ్రంగా వ్యతిరేకించారు. పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. దాంతో ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను హతమార్చాలని పథకం వేసింది. మత్తు ఇంజెక్షన్లు వారికి ఇచ్చి హత్య చేసింది. తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయినట్టు అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి విఫలమైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పట్లో సురేఖను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొన్ని రోజుల క్రితం జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నాడు తల్లిదండ్రులను చంపిన మాదిరిగానే ఆమె కూడా మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.