మొగుళ్లపల్లి, సెప్టెంబర్ 5 : రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి రైతులకు యూరియా అందేలా చూస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎత్తేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందిం చి రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు తిరుపతిరావు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటాలు తప్పా.., ఆచరణలో పనులు చేయడం లేదన్నారు. రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచకుం డా నరకయాతన పెడుతున్నదని, రాత్రి, పగలు తేడా లేకుండా సొసైటీల అన్నదాతలు పడిగాపులు కాస్తు న్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినైట్లెనా లేదన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులకు యూరియా అందుబాటులోకి వచ్చేదాక ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. యూరియా కోసం బీఆర్ఎస్ ధర్నా చేస్తే కార్యకర్తల ఇండ్లలో తనిఖీలు చేయడం సరైంది కాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులను కించపరిచేలా మాట్లాడుతున్నారని, యూరి యా కొరత లేదని సమస్యను పక్కదోవ పట్టించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనమన్నారు. యూరియా కోసం గోస పడుత్ను రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తాకుతుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేలా గోబెల్స్ ప్రచారం చేస్తున్నదన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు చెబుతూనే అదే ప్రాజెక్ట్ నుంచి నీళ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు. ఘోష్ కమిషన్‌తో కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ తయారు చేయించి, దాని ఆధారంగా కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేయించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటేనే వణుకుపుడుతున్నదన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే రేపు, మాపు అంటూ దాట వేస్తున్నదన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి ఎకడ వేసిన గొంగళి అకడే అన్న చందంగా ఉందని విమర్శించారు.
శిలాఫలకాలు తప్పా.. అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ కోడారి రమేశ్, జిల్లా నాయకులు బెల్లంకొండ శ్యాం సుందర్‌రెడ్డి, నరహరి వెంకటరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు నైనకంటి ప్రభాకర్‌రెడ్డి, దానవేని రాములు, పెంతల రాజేందర్‌రెడ్డి, రవీందర్రావు, టీ.కృష్ణారెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.