Viral news : దొంగల చేతులపడ్డ సొమ్ము దొరకడం అంత సులువు కాదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా రికవరీ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమే. కానీ ఇటీవల అమ్మవారి ఆలయంలో చోరీకి గురైన సొమ్ము దొరికింది. అలాగని పోలీసులో, ఆలయ నిర్వాహకులో దొంగను పట్టుకుని చోరీ సొమ్ము రికవరీ చేశారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దొంగతనం చేసిన వ్యక్తి దొరకనేలేదు. కానీ దొంగ ఎత్తుకెళ్లిన నగదు మాత్రం పోయిన దగ్గరే ప్రత్యక్షమైంది. విచిత్రంగా ఉంది కదా..! అయితే వివరాల్లోకి వెళ్దాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం చెరువు కట్ట దగ్గర ఉన్న ‘ముసలమ్మ’ అమ్మవారి ఆలయంలో నెల రోజుల క్రితం చోరీ జరిగింది. దొంగలు ఏకంగా ఆ ఆలయంలోని హుండీనే ఎత్తుకెళ్లారు. ఆలయ నిర్వాహకులు ఇక ఆ సొత్తుపై ఆశలు వదులుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా చోరీకి గురైన సొత్తు ఆలయంలోకి వచ్చింది. దొంగలు ఆ సొత్తును ఒక మూటలో కట్టితెచ్చి, ఆలయంలో విడిచిపెట్టి వెళ్లారు.
ఆ సొత్తుతోపాటు ఒక లేఖను కూడా రాసిపెట్టారు. ‘హుండీలో నగదును దొంగిలించడంతో మా పిల్లలు అనారోగ్యం బారినపడ్డారు. అందుకే అమ్మవారి సొమ్మును అమ్మవారికి తిరిగిస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు. దొంగలు తిరిగి తెచ్చిన నగదును ఆలయ నిర్వాహకులు లెక్కించారు. మొత్తం నగదు రూ.1,86,486 ఉన్నట్లు తెలిపారు. అమ్మవారి మహత్యంవల్లే దోచుకెళ్లిన నగదును దొంగలు తిరిగి తెచ్చిపెట్టారని ఆలయ నిర్వాహకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
Stolen Cash