Roja | ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన రోజా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో కొంతకాలం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించినప్పటికీ, పూర్తి స్థాయిలో రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి కెమెరా ముందుకు వచ్చి రీ ఎంట్రీ ఇవ్వడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.సినిమాలు మానేసినా రోజా ప్రేక్షకులకు దూరం కాలేదు. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా ఆమె ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి బాధ్యతలు స్వీకరించడంతో ఆ షోకు కూడా గుడ్‌బై చెప్పారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రోజా మళ్లీ టీవీ కార్యక్రమాల్లో కనిపించడం ప్రారంభించారు. ఇప్పటికే పలు తెలుగు టీవీ షోలలో గెస్ట్‌గా హాజరవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇప్పుడు సినిమాల్లోనూ రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు రోజా. తెలుగులో చివరిసారిగా 2013లో, తమిళంలో 2015లో నటించిన ఆమె, దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆమె నటించిన తమిళ సినిమా అంబే డయానా టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో పారి ఎలవజగన్, రమ్య రంగనాథన్ జంటగా నటిస్తున్నారు. రోజా ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో కనిపించనున్నారు. టీజర్లో ఆమెకు సంబంధించిన సన్నివేశాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. మరోసారి తల్లి పాత్రలో ఆమె తన అనుభవంతో అద్భుతంగా నటించినట్టు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.
‘అంబే డయానా’ చిత్రం సమ్మర్లో విడుదల కానుంది. దీంతో రోజా అభిమానులు ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో తమిళంలో ‘లెనిన్ పాండ్యన్’ అనే మరో సినిమాలో కూడా రోజా కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అందులో ఆమె వయోవృద్ధ మహిళ పాత్రలో కనిపించనున్నారు. తమిళంలో వరుసగా సినిమాలు చేయబోతున్న రోజా, తెలుగు చిత్రాల్లో ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీవీ కార్యక్రమాలతో పాటు సినిమాల్లోనూ బిజీ అవుతున్న ఆమె, మళ్లీ పూర్తి స్థాయిలో సినీ రంగంలో చురుకుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి, రాజకీయాల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన రోజా ‘అంబే డయానా’తో ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి.