బూర్గంపహాడ్, ఆగస్టు 11 : పారిశ్రామికవాడ సారపాకలోని పలు కాలనీల్లో ఎక్కడ పడితే అక్కడ ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తూ ఇసుక మాఫియా అక్రమ ఇసుక వ్యాపారం యధేచ్ఛగా సాగిస్తున్నారు. సారపాకలోని భాస్కరనగర్, మసీద్ రోడ్, రాజీవ్‌నగర్ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇసుక మాఫియా తమకు నచ్చిన చోట స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసుకుని ఇసుకను రాశులుగా పోసి సామాన్యులకు అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారాన్ని మూడు పువ్వులు…ఆరు కాయలుగా సాగిస్తున్నారు. అక్రమ ఇసుక నిల్వలకు సంబంధించి ఇటీవల కాలంలో ‘నమస్తే తెలంగాణ’ కథనాలు సైతం ప్రచురించింది. సంబంధిత అధికారులు ఇసుక నిల్వలను సీజ్ చేసినప్పటికీ ఇసుక మాఫియా మాత్రం పదే పదే మళ్లీ అదే వ్యాపారాన్ని సాగిస్తూ ఎవరైతే మాకేంటి అన్నచందంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా ఇసుక నిల్వలను ఏర్పాటు చేసిన ప్రదేశాలను రెవెన్యూ అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేయాలని, ఇసుక సామాన్యులకు న్యాయమైన ధరకు అందేలా చూడాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.