చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన అలసట, గుండె కొట్టుకునే వేగం అతి తక్కువగా ఉండటంతో ఆయనను మొహాలీలోని ఫోర్టిస్ హాస్పిటల్లో చేర్పించారు. ఐసొలేషన్ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాన్ ఉన్నారు.
ఫోర్టిస్ హాస్పిటల్ విడుదల చేసిన ప్రకటనలో, ఆయన అవయవాలు నిలకడగా పని చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం పరిశీలనలో ఉంచామని, ఆయన నాడి కొట్టుకునే వేగం మెరుగుపడిందని పేర్కొంది. వైద్య బృందం ఆయన పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మాన్ అంతకుముందు వైరల్ ఫీవర్తో బాధపడినట్లు తెలుస్తున్నది.