IND vs RSA : పొట్టి ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. ఏకపక్ష పోరులో టీమిండియాను ఒత్తిడిలో పడేసి.. 76 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇరుజట్లు ఇన్నింగ్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాయి. కానీ, డేవిడ్ మిల్లర్(63), డెవాల్డ్ బ్రెవిస్(45)ల మెరుపులతో కోలుకున్న ప్రొటీస్ మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తీసుకుంది.. ఆపై పేసర్ల విజృంభణతో అజేయ భారత్‌కు ఓటమిని రుచి చూపించింది. భారీ ఛేదనలో టాపార్డర్ కుప్పకూలగా.. ఆపద్భాందవుడు సూర్యకుమార్ యాదవ్(18) సైతం తేలిపోయాడు. శివం దూబే(43) ఒంటరిపోరాటం చేసినా అది సరిపోలేదు.
ఐసీసీ ఈవెంట్లలో ఒత్తిడికి లోనయ్యే దక్షిణాఫ్రికా పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం చెలరేగిపోతోంది. గ్రూప్ డీ నుంచి టాపర్‌గా సూపర్ 8కు దూసుకొచ్చిన సఫారీ టీమ్.. తొలి మ్యాచ్‌లో ఫేవరెట్ భారత్‌ను ఓడించింది. 188 పరుగుల చేదనలో టీమిండియాను కార్బిన్ బాస్చ్(2-12), మార్కో యాన్సెన్(4-22)లు దెబ్బకొట్టారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్(0)ను ఎడెన్ మర్క్రమ్ ఔట్ చేయగా.. యాన్సెన్ తొలి బంతి ఎడ్జ్ తీసుకోగా తిలక్ వర్మ(1) వికెట్ కీపర్ డికాక్ చేతికి చిక్కాడు.
SCENES 👏 pic.twitter.com/iPzIMuDFMQ
— ESPNcricinfo (@ESPNcricinfo) February 22, 2026
ఆదిలోనే రెండు వికెట్లు పడిన వేళ.. ఓపెనర్ అభిషేక్ శర్మ(15) 6, 4తో ఆశలు రేపినా.. యాన్సెన్ అతడిని బోల్తా కొట్టించాడు. 26కే వికెట్లు పడిన వేళ.. కెప్టె్న్ సూర్యకుమార్ యాదవ్(18), వాషింగ్టన్ సుందర్(11)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, ఈ ద్వయాన్ని విడదీస్తూ సుందర్‌ను కార్బిన్ బాస్చ్ పెవిలియన్ చేర్చాడు. రన్‌రేటు ఒత్తిడిలో గేర్ మార్చాలనుకున్న సూర్య తేఇలికైన క్యాచ్‌తో వికెట్ ఇచ్చేశాడు. దాంతో.. 51వద్ద ఐదో వికెట్ పడింది. హార్దిక్ పాండ్యా(18), శివం దూబే(43)లకుపెద్ద షాట్లు ఆడేందుకు సఫారీలు అవకాశం ఇవ్వకపోవడంతో.. బౌండరీలు కరువయ్యాయి.
మహరాజ్ ఓవర్లో సిక్సర్‌కు యత్నించిన పాండ్యా బౌండరీ లైన్ వద్ద స్టబ్స్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. మూడో బంతికి రింకూ సింగ్ సైతం స్టబ్స్‌కు దొరికాడు. అక్కడితో భారత ఓటమి ఖాయమైంది. ఆశ్యర్యంగా.. అర్ష్‌దీప్ కూడా పాండ్యా స్టయిల్లోనే స్టబ్స్‌కు చిక్కాడు. దూబే సిక్సర్లతో పరుగుల అంతరం తగ్గించాడంతే. దూబే, బుమ్రాలు వెంటవెంటనే ఔటవ్వగా.. 76 పరుగుల తేడాతో ప్రొటిస్ జట్టు గెలుపొందింది.
సూపర్ 8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా హిట్టర్లు చెలరేగిపోయారు. పవర్ ప్లే కింగ్ బుమ్రా(3-15) టాపార్డర్‌ను కూల్చినా.. డేవిడ్ మిల్లర్(63), డెవాల్డ్ బ్రెవిస్(45) విధ్వంసక ఆటతో రెచ్చిపోయారు. 20కే మూడు వికెట్లు పడినా.. ఒత్తిడికి లోనవ్వని ఈ ద్వయం మిడిల్ ఓవర్లలో బౌండరీల మోత మోగించింది. నాలుగో వికెట్‌కు 97 రన్స్ జోడించిన ఈ జోడీ వెనుదిరిగాక.. సఫారీల స్కోర్ వేగానికి బుమ్రా, అర్ష్‌దీప్ కళ్లెం వేశారు. అయినా.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్(44 నాటౌట్) దంచేయడంతో మర్క్రమ్ సేన7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది