మంగళవారం 26 మే 2020
Warangal-rural - May 24, 2020 , 03:30:59

మత్తిచ్చి.. ముంచేశారా..?

మత్తిచ్చి.. ముంచేశారా..?

  • ఘటనకు ముందు పెనుగులాట
  • నలుగురి ఒంటిపై గాయాలు
  • ఆత్మహత్యలు కాదు హత్యలే!
  • ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు
  • బావిలోని గుట్టు వీడుతున్నది. ముందుగా 

అంతా ఆత్మహత్య అని భావించినా.. తొమ్మిది మంది హత్య చేయబడ్డారని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదికలో సైతం నివ్వెరబోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్లే తొమ్మిది మంది మృతి చెందారని ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్‌ విభాగం వైద్యులు వెల్లడించారు. దీంతో బావిలో పడే వరకూ మృతులంతా ప్రాణాలతో ఉన్నారని, అందరూ బావిలోనే తుది శ్వాస విడిచారని తేలింది. ఎవరో పక్కాప్లాన్‌తో నిద్ర మత్తు గోలీలు, ఇతర మత్తు పదార్థాలను ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత ఈ తొమ్మిది మందిని బావిలో పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతుల్లో నలుగురి ఒంటిపై గాయాలు ఉండడంతో ఘటనకు ముందు పెనుగులాట జరిగిందని అంచనాకు వచ్చారు. అయితే ఇంతమందిని ఒకేసారి హత్య చేయడం, బావిలో పడేయడం ఎలా సాధ్యమైంది. ఈ దారుణం వెనుక ఎంతమంది ఉన్నారు..? అనే కోణాల్లో ఆరు దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగి విచారణ సాగిస్తున్నాయి.  

పోస్టుమార్టం రిపోర్టుతో మలుపుతిరిగిన కేసు

రంగంలోకి ఆరు దర్యాప్తు బృందాలు

హైదరాబాద్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు మృతుల విసెరా.. 

నివేదిక రాకతో వీడనున్న గొర్రెకుంట 

మరణాల రహస్యం  

ఘటనాస్థలిని సందర్శించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి

మృతుల అంత్యక్రియలు వాయిదా

వరంగల్‌ రూరల్‌-నమస్తేతెలంగాణ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. తొమ్మిది మంది మృతి కేసులో కాల్‌డేటాతో డొంక కదులుతున్నది. పోస్టుమార్టం నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మృతుల్లో నలుగురి ఒంటిపై గాయాలు ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్లే తొమ్మిది మంది మృతి చెందారని ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్‌ విభాగం వైద్యులు వెల్లడించారు. బావిలో పడేవరకు మృతులు తొమ్మిది మంది సజీవంగా ఉన్నారని, అందరూ బావిలోనే తుది శ్వాస విడిచారని భావిస్తున్నారు. అవి ఆత్మహత్యలు కావని, హత్యలేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఎవరో పక్కాప్లాన్‌తో నిద్ర మత్తు గోలీలు, ఇతర మత్తు పదార్థాలను వాడి మత్తులోకి జారుకున్న తర్వాత ఈ తొమ్మిది మందిని బావిలో పడేసి ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల నుంచి సేకరించిన శాంపిళ్ల (విసెరా)ను వైద్యులు హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌)కి పంపారు. ఈ రిపోర్టు కీలకం కావడంతో సాధ్యమైనంత త్వరగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి నివేదిక తెప్పించే పనిలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.

వరంగల్‌రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలో గోనెసంచుల గోదాము ఆవరణలోని పాడుబడిన బావిలో గురువారం నలుగురి మృతదేహాలు, శుక్రవారం మరో ఐదుగురి మృతదేహాలను పోలీసులు కనుగొన్న విషయం తెలిసిందే. ఒక బావిలో తొమ్మిది మంది మృతదేహాలు లభ్యం కావడం, మూడు రాష్ర్టాలకు చెందిన ఈ తొమ్మిది మందిలో ఒకే కుటుంబం నుంచి ఆరుగురు ఉండడం సంచలనం కలిగించింది. మొదట ఈ మరణాలను ఆత్మహత్యగా భావించిన పోలీసులు ఆ తర్వాత అనుమానాలు ముసురుకోవడంతో అనుమానస్పదమైనవిగా ప్రకటించారు. తొమ్మిది మంది మృతదేహాలకు వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో పోస్టుమార్టం జరిగింది. 

మరోసారి పరిశీలన

తొమ్మిది మంది మృతి కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఆరు బృందాలు పనిచేస్తున్నాయి. ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలతో పాటు టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌, సైబర్‌ క్రైం విభాగం, క్లూస్‌, ఫింగర్‌ ప్రింట్‌, ఐటీ కోర్‌ టీం తదితర విభాగాల ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, నిపుణులు ప్రత్యేక టీంల్లో ఉన్నారు. వరంగల్‌ పోలీసు కమిషనరు వీ రవీందర్‌, ఈస్ట్‌జోన్‌ అదనపు డీసీపీ వెంకటలక్ష్మి ప్రత్యేక బృందాలను పర్యవేక్షిస్తున్నారు. శనివారం అదనపు డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌, గీసుగొండ, పర్వతగిరి, నర్సంపేట ఇన్‌స్పెక్టర్లు శివరామయ్య, పీ కిషన్‌, కరుణసాగర్‌రెడ్డితో పాటు ప్రత్యేక టీంల్లోని ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, టాస్క్‌ఫోర్సు, సీసీఎస్‌, క్లూస్‌, ఫింగర్‌ ప్రింట్‌ తదితర విభాగాల్లోని అధికారులు గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలోని గోనె సంచుల గోదామును సందర్శించారు. గోదాము ఆవరణ, మృతదేహాలు వెలికితీసిన పాడుబడిన బావి పరిసరాలను చూశారు. తొమ్మిది మంది మృతుల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మక్సూద్‌ కుటుంబం, ఇద్దరు బీహారీలు నివసించిన గోదా ము ఆవరణలోని గదులను సీజ్‌ చేశారు. ఈ గదుల్లో ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్‌, స్టేట్‌ ఇంటెలిజెన్సీ అధికారులు ఈ గోదామును సందర్శించారు. గోదా ము పరిసరాలను పరిశీలించి, చుట్టు పక్కల ఆరా తీశారు. తొమ్మిది మందిలో ఇద్దరి మొబైల్స్‌ ప్రత్యేక బృందాలకు శనివారం లభించినట్లు తెలిసింది. దీన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. మృతుల్లో ఎండీ మక్సూద్‌ మొబైల్‌ మినహా ఇతరుల మొబైల్స్‌ బుధవారం రాత్రి కొద్ది సమయం తేడాతో స్విచ్‌ఆఫ్‌ అయినట్లు తేలింది. మక్సూద్‌ మొబైల్‌ మాత్రం శుక్రవారం ఉదయం వరకు పనిచేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఫోరెన్సిక్‌ బృందం మరోసారి శనివారం గోదామును సందర్శించి నమూనాలు సేకరించింది. గో దాము ఆవరణలో, బావి పరిసరాల్లో ఈ నమూనాల సేకరణ జరిగింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గొర్రెకుంటలోని గోనెసంచుల గోదామును సందర్శించారు. ఎక్కడో బీహార్‌, బెంగాల్‌ నుంచి వలసొచ్చిన కార్మికులు ఇక్కడ చని పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ తనకు ఫోన్‌ చేసి వివరాలు ఆరా తీశారన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు కోరితే మృత దేహాలను స్వస్థలాలకు పంపేందుకు తగిన చర్యలు తీ సుకుం టామని ఎమ్మెల్యే చెప్పార

గుట్టు విప్పనున్న కాల్‌డేటా..

మృతుల మొబైల్స్‌ కాల్‌డేటా తొమ్మిది మంది మరణం వెనక ఉన్న గుట్టు విప్పనుంది. కాల్‌డేటా ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తులో ముందుకు వెళ్తున్నాయి. మృతుల్లో ఎండీ మక్సూద్‌ అలం, అతని కూతురు బుస్రాతో పాటు షకీల్‌ ఫోను నంబర్ల నుంచి సంఘటన జరగడానికి ముందు కాల్స్‌ ఎవరెవరికి వెళ్లాయి? అనేది కాల్‌డేటా తీశారు. ఈ ముగ్గురితో పాటు బీహారీల మొబైల్స్‌కు వచ్చిన ఇన్‌కమింగ్‌, ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ అన్నింటినీ పరిశీలిస్తున్నారు. మక్సూద్‌ కుటుంబంతో సన్నితంగా ఉన్న వ్యక్తుల మొబైల్‌ కాల్‌డేటాను తీశారు. సంఘటన జరగడానికి ముం దు మక్సూద్‌ పలువురితో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ మేరకు తాజాగా శనివారం బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఘటన జరిగిన గోనె సంచుల గోదాములో పనిచేసే కొందరిని, గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలో మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మక్సూద్‌ కూతురును ప్రేమించినట్లు చెబుతున్న యువకుడినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గోనెసంచుల గోదాము వద్దకు వరంగల్‌- నర్సంపేట రోడ్డులోని గొర్రెకుంట క్రాస్‌ నుంచి, కట్టమల్లన్నచెరువు, మొగిలిచర్ల నుంచి చేరుకునే రోడ్లపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అనేక కోణాల్లో ప్రత్యేక పోలీసు బృందాల దర్యాప్తు కొనసాగుతున్నందున ఒకటి రెండు రోజుల్లో తొమ్మిది మంది మృతిపై మిస్టరీ వీడే పరిస్థితి కనపడుతున్నది.

పకడ్బందీగా దర్యాప్తు చేయండి: హోంమంత్రి 

వరంగల్‌ క్రైం/వరంగల్‌ చౌరస్తా/గీసుగొండ/ ధర్మారం: గొర్రెకుంటలో జరిగిన ఘటనపై పకడ్బందీగా దర్యాప్తు జరపాలని వరంగల్‌ సీపీ రవీందర్‌ను హోంశాఖ మంత్రి మహమ్మద్‌ అలీ ఫోన్‌లో ఆదేశించారు. మృతదేహాలను బంధువులకు అప్పగించి, వారికి కావాల్సిన సహకారం అందించాలని సూచించారు

అంత్యక్రియలు వాయిదా

గొర్రెకుంట ఘటనలో మృతి చెందిన తొమ్మిది మంది అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. ఎంజీఎం మార్చురీలో శుక్రవారం రాత్రి పోస్టుమార్టం పూర్తి అయిన విషయం తెలిసిందే. మక్సూద్‌ కుటుంబానికి బంధువులు లేరు. బీహార్‌కు చెందిన ఇద్దరి కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వాన్నే అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. శాంతినగర్‌లో నివాసముంటున్న షకీల్‌ భార్య ఆర్థిక స్థోమత లేదని తెలుపడంతో మృతదేహాలను గీసుగొండ తహసీల్దార్‌కు అప్పగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. నిబంధనల ప్రకారం మృతదేహాలను బంధువులకు అప్పగించాలి. వారు లేకపోతే మృతికి కారణాలను గుర్తించే వరకు భద్రపర్చాలి. ఈ మేరకు మార్చురీ ఫ్రీజర్లలో మృతదేహాలను భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల కస్టడీలో తోటికూలీలు?

కార్మికుల మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించారు. చనిపోయిన వారితో పని చేసే కూలీలను పోలీసులు గుర్తించారు. వారితో పాటు యాకూబ్‌, సుమన్‌, మరో ఇద్దరు, ఇండస్ట్రియల్‌ ఏరియాలో పనిచేస్తున్న మరో నలుగురు బీహారీలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తూ, క్లూస్‌టీమ్‌తో పరిశీలించినట్లు తెలిసింది. మృతుల సెల్‌ఫోన్ల కోసం గాలిస్తున్నట్లు సమాచారం. కాగా, మక్సూద్‌కు చెందిన పెంపకం కోడి ఆయన ఇంటి చుట్టూనే తిరుగుతుండడంతో పోలీసులు దానిని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. మక్సూద్‌ ఉండే గదిని పోలీసులు సీజ్‌ చేసే వరకు కోడి ఆ గది నుంచి బయటకు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అనుమానాస్పద మరణాలకు మూగ ప్రాణి సా క్ష్యంగా ఉన్నది. logo