సోలార్.. సో బెటర్

- అడవి పందుల సమస్యకు చెక్
- సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుతో నిశ్చింతగా రైతు..
- ఖర్చు తక్కువ.. భద్రత ఎక్కువ
- రాత్రింబవళ్లు పంట కావలి బాధలు తప్పినట్లే..
- ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
కొడంగల్, జనవరి2: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చేవరకు జాగ్రత్తగా కాపాడాలి. ప్రధానంగా అడవి పందుల బెడద ఏర్పడుతుంది. పంట వేసిన నాటి నుంచి రక్షించేందుకు రాత్రి, పగలు కావలి కాయాల్సి వచ్చేది. కానీ ఆ బాధలు సోలార్ ఫెన్సింగ్‌తో తప్పుతున్నాయి. దీంతో సోలార్ ఫెన్సింగే.. సో బెటర్ అని రైతులు అభిప్రాయపడుతున్నారు.
పంట భద్రతకు అనేక పాట్లు
కొడంగల్ నియోజకవర్గంలో అధికంగా సారవంతమైన నల్లరేగడి భూములు ఉన్నాయి. జొన్న, కంది పంటలకు పెట్టింది పేరు. అడవి పందుల బెదడ ఉన్నప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటూ, రాత్రుల్లో పురుగు, పుట్ట్ర అని చూసుకోకుండా పంటలను కాపాడుకుంటూ వస్తున్నారు రైతులు. ఈ మధ్య కాలంలో అడవి పందుల బెడద మరింతగా పెరిగిపోయింది. దీంతో జొన్న పంటను పండించుకునేందుకు రైతులు ఆసక్తిని చూపడంలేదు. జొన్న, పెసర, మినుము, వేరుశనగ, శనగ వంటి పంటలకు అడవి పందుల బెడద అధికంగా ఉంటుంది. పత్తికి ఈ బెడద తప్పడంలేదు. కాబట్టి పంటను కాపాడుకునేందుకు చుట్టూ పాత చీరలు కట్టడం, ముండ్ల్ల కంప ఏర్పాటు చేయడం లాంటివి చేసేవారు. పంట చుట్టూ చీరలు కట్టడంతో గాలికి చీరల శబ్ధానికి అడవి పందులు భయపడి పారిపోయేవి. ఒక్కోసారి గుంపులు, గుంపులుగా చేరుకుని పంటను పూర్తిగా నాశనం చేసేవి. చీరలు కట్టడం వల్ల కొంతమేరకు అడవి పందులు, ఇతర జీవాల బాధలు తప్పినట్లు రైతులు తెలిపారు. రాను రాను చీరకట్టుకు అడవి పందులు కూడా అలవాటు పడి, భయపడడం లేదని, దీంతో పంట రక్షణకు భయపడి చాలామంది రైతులు జొన్న పంట పండించడం లేదు.
విద్యుత్ షాక్‌తో తీవ్ర ఇబ్బందులు
అడవి పందుల బెడద నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి రాత్రుల్లో కరెంట్‌ను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసేవారు. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె కాస్త పశువులు, మనుష్యుల మరణాలకు దారి తీయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు రైతులు తెలిపారు. పందుల బెడద కంటే విద్యుత్ కంచె నుంచి కాపాడేందుకు కావలి కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో విద్యుత్ కంచె వేసుకోవడం మానేసినట్లు వారు పేర్కొంటున్నారు. కరెంట్ సరఫరాతో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
సోలార్‌తో తీరిన అడవి పందుల బెడద
సోలార్ సౌకర్యం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రాత్రి పగలు నిశ్చింతగా పంట సాగు చేసుకుంటున్నారు. సోలార్ వల్ల ఎలాంటి ప్రాణహాని లేదు. సోలార్ తీగలను తగిలితే చాలు షాక్ కొట్టడం మాత్రమే సంభవిస్తుంది. దీంతో సోలార్‌ను రైతులు అధికంగా వినియోగిస్తున్నారు. పంట చుట్టూ తీగలు ఏర్పాటు చేసి, పొలంలో సోలార్ పరికరాన్ని అమర్చుకొంటున్నారు. సోలార్ ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి అడవి పందుల బెడద తగ్గిందని, లేదంటే వేసుకున్న పంట పూర్తిగా నాశనం చేసేవని రైతులు తెలిపారు. సోలార్‌తో పంట భద్రత ఏర్పడుతుండడంతో జొన్న సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
పంట వేసుకున్న నాటి నుంచి..
సోలార్ సౌకర్యం అందుబాటులో లేని సమయంలో పంట వేసుకున్న నెల రోజుల నుంచి ఇంటికి చేరే వరకు కాపాలా కాయాల్సి వచ్చేది. ఏ మాత్రం ఆదమరిచిననా అడవి పందులు జొన్నను నాశనం పట్టించేవి. దీంతో రాత్రింబవళ్లు రైతులు పంట పొలాల్లోనే జీవనం కొనసాగించేవారు. అడవి పందులను చెదరగొట్టేందుకు పొలంలో తిరుగుతూ శబ్ధాలు చేస్తూ, అప్రమత్తంగా ఉండేవారు. కొన్ని సందర్భాల్లో విష పురుగులతో భయపడాల్సి వచ్చేది.
సోలార్ ఫెన్సింగ్‌తో నిశ్చింతగా..
సొలార్ ఫెన్సింగ్ ఏర్పాటుచేసిన నాటి నుంచి నిశ్చింతగా పంటను పండించుకుంటున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. తీగను ఏర్పాటు చేసుకుని దానికి సోలార్ కనెక్షన్ అందిస్తే సూర్యరశ్మికి చార్జింగ్ అవుతూ తీగకు కరెంటు సరఫరా అవుతుంది. సోలార్ ఫెన్సింగ్ తీగ తాకడం వల్ల పెద్దపాటి విద్యుత్ షాక్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి ప్రాణహాని కలుగదు. ఒక్కసారి షాక్ తగిలితే ఆ చుట్టుపక్క ప్రాంతంలో అడవి పందులు కనిపించకుండా పరుగులు తీస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఎలాంటి జీవాలు వచ్చినా వాటికి ఏ ప్రమాదం లేదని, అందుకే సోలార్ వాడకానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.
తక్కువ ఖర్చుతో పంట భద్రత..
సోలార్ ఏర్పాటు చేసుకోవడం చాలా సులువు. తక్కువ ఖర్చు అవుతుండడం రైతులకు సౌకర్యంగా ఉం ది. ఎకరం పొలానికి ఫెన్సింగ్ వేసుకోవడానికి సుమారు రూ.1000 నుంచి రూ.1200ల వరకు ఖర్చు వ స్తుంది. ఒక్కసారి ఏర్పాటు చేసుకుం టే ఎన్నో పంటలకు ఉపయోగపడుతుంది. సోలార్ భద్రతతో ప్రస్తుతం ఏడాదికి మూడు పంటలు పండించుకుంటున్నారు.
అడవి పందుల బెడదకు సోలారే బెటర్
అడవి పందుల బెదడ అధికంగా ఉండడం వల్ల సోలార్ వాడకం తప్పనిసరిగా మారింది. గుంపులు, గుంపులుగా వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. ఒక్కోసారి వ్యక్తులపై పైకి వచ్చి గాయపరుస్తున్నాయి. దీంతో రాత్రుల్లో పంట కాపాలా కాయాలంటే భయంగా ఉంది. ఐదెకరాల జొన్న పంట వేసుకున్నాం. పంట చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేసుకోవడం వల్ల పంట బాగుంది.
- వెంకట్రాములు, రైతు, కొడంగల్
ప్రస్తుతం సోలారే కాపలా..
అప్పట్లో అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు కాపలా కాయాల్సి వచ్చేది. ప్రస్తుతం సోలార్ సౌకర్యం అందుబాటులో రావడం వల్ల పంటకు భద్రత ఏర్పడుతున్నప్పటికీ.. సోలార్ పరికరాన్ని కాపాడుకునేందుకు కాపాలా కాయాల్సి వస్తున్నది. పంట రక్షణకు ఏర్పాటు చేసుకున్న సోలార్ పరికరం దొంగతనాలు జరుగుతున్నాయి.
- ర్యాలపేట పార్థసారథి రైతు, కొడంగల్
తాజావార్తలు
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
- మెసేజ్ పెట్టడానికి, కాల్ చేసేందుకు ఎవరూ లేరు
- ‘బీజేపీ నాయకులు కేంద్రాన్ని నిలదీయాలి’
- 70 ఏళ్లున్న నాకెందుకు టీకా.. ముందు యువతకు ఇవ్వండి!
- చెన్నైలో వ్యాక్సిన్ తీసుకున్న వెంకయ్యనాయుడు