బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 04:12:22

రెండ్రోజులు ఉరుముల వానలు

రెండ్రోజులు ఉరుముల వానలు

  • బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం  l  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి
  • శుక్రవారం వికారాబాద్‌ జిల్లా తాండూరులోని కాగ్నా నదిలో వరద ఉద్ధృతికి కోతకు గురైన తాండూరు-మహబూబ్‌నగర్‌ రోడ్డు
హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గర పశ్చిమ బంగాళాఖాతంలో 3.1 ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్‌రూరల్‌, వరంగల్‌అర్బన్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో శనివారం చాలాచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటి రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆదివారం పలుచోట్ల ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు పేర్కొన్నారు. మరోవైపు, నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. గ్రేటర్‌లో రెండ్రోజులుగా పగలు ఉక్కపోత ఉండగా, రాత్రి సమయంలో వర్షం కురుస్తున్నది.

వికారాబాద్‌ జిల్లాలో దంచికొట్టిన వాన

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: వికారాబాద్‌ జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి తాండూరులోని కాగ్నా నది పొంగిపొర్లింది. నదిలో నీటి ఉధృతికి రహదారి కొట్టుకుపోవడంతో తాండూరు-మహబూబ్‌నగర్‌ మధ్య వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పూడూర్‌ మండలంలోని కంకల్‌ వద్ద ఈసీ వాగు పొంగిపొర్లింది. అత్యధికంగా పెద్దేముల్‌ మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి నియోజకవర్గంలోని చెరువులకు భారీగా వరద చేరడంతో జలకళను సంతరించుకున్నాయి.

తాజావార్తలు


logo