Harish Rao | మెదక్, సిద్దిపేట జిల్లాల వాసులను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఎమ్మెల్యే హరీశ్ రావు టీం ముందుగా మెదక్ జిల్లాలోని రాజాపేట గ్రామంలో వరదలో చిక్కుకొని చనిపోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించడంతోపాటు పలు ప్రాంతాల్లో పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు. అనంతరం సిద్దిపేట పట్టణ కేంద్రంలో లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే హరీశ్ రావు పరిశీలించారు.
ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో 10 సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు. తొగుట మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం పడి ప్రజలు ఇబ్బంది పడ్డారని.. గత 20 సంవత్సరాలలో సిద్దిపేటలో ఇలాంటి వర్షం ఎప్పుడు పడలేదన్నారు. భారీ వర్షం వల్ల సిద్దిపేటలో పలు కాలనీలు జలమయమయ్యాయని.. సిద్దిపేటలో వచ్చిన వరదను తగ్గించడానికి నర్సాపూర్ చెరువుకు ఒక మీటర్ తొలిగించామని స్పష్టం చేశారు.
నర్సాపూర్ చెరువు నీటిని శనిగరం వాగు, మందపల్లి వాగువైపు మళ్లించాం. భవిష్యత్తులో వరద వచ్చినపుడు ఎలా ముందస్తు చర్యలు చేపట్టాలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు చేయాలని సూచించామన్నారు. ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా హరీశ్ రావు కోరారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
నాలాలు కబ్జాలు చేసి సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు కట్టడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. నాలాలు కబ్జాలు చేసి ఇల్లు నిర్మించుకున్న తర్వాత వరదలు వస్తే బాధపడితే ఎలా..? అన్నారు. లోతట్టు ప్రాంతాలలో తక్కువ ధరకు వస్తున్నాయని ఇల్లు నిర్మించుకునే విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మించుకోకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఆందోళన చెందొద్దని మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పరవేక్షణ చేయాలన నిర్దేశించినట్టు హరీశ్ రావు చెప్పారు.
Cybercrime | సైబర్ వలలో ఆలయ ఉద్యోగి.. లక్షల్లో మోసపోయిన బాధితుడు
Clay Ganesh | కండ్లకు గంతలు కట్టుకొని.. కేవలం 54 నిమిషాల్లో గణనాథుని విగ్రహం తయారీ
Kamareddy Rains | రెస్క్యూ టీంను పంపించండి సార్.. కామారెడ్డి కాలనీల్లో వరద ముంపు బాధితుల ఆర్తనాదాలు
Watch: పసి బిడ్డకు టీకా వేసేందుకు.. ఉప్పొంగుతున్న వాగును దాటిన ఆరోగ్య కార్యకర్త