హైదరాబాద్, ఫిబ్రవరి 22 : సీనియర్ కార్టూనిస్టులు సురేంద్ర, గజ్జెల మల్లారెడ్డి సంయుక్తంగా అందించిన ‘అక్షింతలు’ కార్టూన్ సంకలన పుస్తకావిష్కరణ సభ ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఘనంగా జరిగింది. రాజకీయ–సామాజిక వ్యాఖ్యానంతో కూడిన ఈ గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమం సాహిత్య, పత్రికారంగ, కార్టూన్ రంగ ప్రముఖుల సమక్షంలో ఆత్మీయంగా సాగింది.
అక్షింతలు ఆవిష్కరణ సభకు సభకు మందలపర్తి కిషోర్ అధ్యక్షత వహించారు. గజ్జెల మల్లారెడ్డి కుమారుడు గజ్జెల అశోక్ తమ నాన్నగారు రచించిన కవితలను గుర్తుచేసుకుంటూ, ఆ సాహిత్య వారసత్వాన్ని సభికులతో ఆత్మీయంగా పంచుకున్నారు. ప్రముఖ కవయిత్రి, జర్నలిస్టు కొండేపూడి నిర్మల మాట్లాడుతూ.. “సురేంద్ర మా కుటుంబ సభ్యుడే. కుటుంబంలో ఆయన మెలిగే క్రమశిక్షణ, నిష్ఠ ఆయన కార్టూన్లలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి” అని పేర్కొన్నారు. వ్యక్తిత్వం–సృజన మధ్య ఉన్న అనుబంధాన్ని ఆమె హృదయపూర్వకంగా వివరించారు.
అక్షింతలు పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్టూనిస్ట్లు
సీనియర్ జర్నలిస్టు తల్లావజుల శివాజీ పాత ‘ఉదయం’ రోజులలో సురేంద్ర, గజ్జెల మల్లారెడ్డితో తమ అనుబంధాన్ని స్మరించుకున్నారు. వీరు ఆ రోజుల్లో పత్రికారంగంలోని వాతావరణం, సృజనాత్మక చర్చలు, కార్టూన్లపై జరిగిన వాదోపవాదాలను గుర్తుచేసి సభను ఆత్మీయంగా మార్చారు. ముఖ్య అతిథిగా హాజరైన పాశం యాదగిరి భావోద్వేగంగా మాట్లాడారు. “మల్లారెడ్డి–సురేంద్ర కలయికతో వచ్చిన ఈ పుస్తకం ఎంతో బాగుంది. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు అవసరం; ఆత్మను శుద్ధి చేసుకోవడానికి జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల వల్ల కారే కన్నీళ్లు అవసరం” అని ఆయన వ్యాఖ్యానించారు. ‘అక్షింతలు’ అలాంటి జ్ఞాపకాల పుటల సమాహారమని యాదగిరి అభివర్ణించారు.
అప్పటి రాజకీయ పరిస్థితులపై సురేంద్ర ఎంతో ధైర్యంగా కార్టూన్లు గీశారని కార్టూనిస్టు మృత్యుంజయ తెలిపారు. “ఇప్పుడు అలా గీస్తే సోషల్ మీడియాలో ట్రోల్ చేసి, కేసులు వేయించే పరిస్థితి ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత పదునైన కార్టూన్లు గీసినందుకు సురేంద్ర సతీమణి శారదను ప్రత్యేకంగా అభినందించారు. “ఇంట్లో ప్రశాంతత ఉంటేనే ఇలాంటి కార్టూన్లు సాధ్యం. బొమ్మలతో నవ్వించడం నవ్వులాట కాదు” అని మృత్యుంజయ అన్నారు. ‘అక్షింతలు’ పుస్తకం మల్లారెడ్డి గజ్జెలకు సురేంద్ర సవ్వడిగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.
రచయిత తాడి ప్రకాశ్ మాట్లాడుతూ.. గజ్జెల మల్లారెడ్డి కేవలం కవే కాకుండా మంచి వక్త కూడా అని అన్నారు. సురేంద్ర అప్పట్లో గీసిన కొన్ని పదునైన కార్టూన్లను గుర్తు చేస్తూ సభికులను నవ్వుల్లో ముంచెత్తారాయన. కార్టూన్లోని వ్యంగ్య రసాన్ని విశ్లేషిస్తూ, అది సమాజానికి అద్దమని ప్రకాశ్ వ్యాఖ్యానించారు. ప్రముఖ కార్టూనిస్టు నర్సింగారు సురేంద్రతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. కార్టూన్ రంగంలో ఆయన సాధించిన ప్రత్యేక స్థానం గురించి ప్రస్తావించారు. సురేంద్ర రేఖలోని ధైర్యం, భావవ్యక్తీకరణలోని స్పష్టత ఆయన ప్రత్యేకత అని అభిప్రాయపడ్డారు.
ఇతర ప్రసంగకర్తలు కూడా ‘అక్షింతలు’లోని కార్టూన్లు సమకాలీన రాజకీయాలపై, సామాజిక పరిణామాలపై ఘాటైన వ్యాఖ్యానాలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఒకే చిత్రంలో పది సంపాదకీయాల బలం దాగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘అక్షింతలు’ కార్టూన్ సంకలనం మాత్రమే కాదు; అది సమాజానికి అందించిన ఆలోచనా అక్షింతలని సభలో పలువురు వ్యాఖ్యానించారు. ఆత్మీయ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో పత్రికా రంగ ప్రతినిధులు, కార్టూన్ అభిమానులు, సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.