Nani | న్యాచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా, ప్రమోషన్స్‌ను కూడా చిత్ర బృందం వేగవంతం చేసింది. తాజాగా చిత్ర బృందం నాని పోషిస్తున్న ‘జడల్’ పాత్రకు సంబంధించిన ఓ పవర్ఫుల్ స్టిల్‌ను విడుదల చేసింది. ఇందులో బాక్సింగ్ బ్యాగ్‌ను బలంగా పంచ్ కొడుతూ కనిపించిన నాని లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గుబురు జుట్టు, రఫ్ గడ్డం, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్తో నాని పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించారు.
ఈ స్టిల్‌ను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో భారీగా షేర్ చేస్తూ, నాని కెరీర్లో మరో మాస్ పాత్ర రాబోతోందని కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటికే చిత్ర యూనిట్ ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు విడుదలైన ‘జడల్’ స్టిల్‌తో టీజర్‌పై ఆసక్తి మరింత పెరిగింది. శ్రీకాంత్ ఓదెల ఈసారి కూడా తన మార్క్ రియలిస్టిక్ టేకింగ్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో యువ నటి కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రముఖ నటులు రాఘవ్ జుయాల్, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన పాత్రలతో ఈ సినిమా కథకు మరింత బలం చేకూరనుంది.
‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ డ్రామా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ‘దసరా’తో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న నాని-శ్రీకాంత్ ఓదెల జోడీ, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో మరింత భారీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార కంటెంట్ సినిమాపై భారీ బజ్‌ను తీసుకొచ్చాయి. తాజాగా విడుదలైన ‘జడల్’ స్టిల్ ఆ అంచనాలను మరో మెట్టు ఎక్కించింది.ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 6న విడుదల కానున్న టీజర్‌పైనే ఉంది. ఈ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతుందా? నాని మరోసారి తన మాస్ అవతార్‌తో అభిమానులను మెప్పిస్తాడా? అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. అభిమానులు మాత్రం ‘జడల్’ పాత్రతో నాని మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.