గత కొన్నేండ్లుగా ఊపందుకున్న పాన్ ఇండియా ట్రెండ్.. సినిమా తాలూకు భాషాంతరాలను చెరిపివేసింది. ప్రాంతీయ సినిమా విస్తృతిని బాగా పెంచింది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి 2898’లాంటి చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా ఖ్యాతిని చాటాయి. అదే సమయంలో టాలీవుడ్ మార్కెట్ విలువ కూడా రెట్టింపైంది. నటీనటులకు బహుభాషల్లో అవకాశాలతో పాటు పారితోషికాలు కూడా అనూహ్యంగా పెరిగాయి. ఇదంతా ఓ పార్శమైతే.. పాన్ ఇండియా సినిమాల తాలూకు ప్రతికూలతలు ఇప్పుడు టాలీవుడ్‌ను వెంటాడుతున్నాయి. షూటింగ్స్‌లో జాప్యం, భారీ నిర్మాణ వ్యయాలతో నిర్మాతలపై ఆర్థిక భారం పడుతున్నది. మొత్తంగా రెండు వైపులా పదునున్న కత్తిలా పాన్ ఇండియా ట్రెండ్ తెలుగు ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్నదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో తెలుగు అగ్రహీరోలందరూ ఏడాదికో సినిమా తప్పకుండా చేసేవారు. ఇప్పుడు పాన్ ఇండియా మోజులో పడి రెండుమూడేండ్లకు ఒక్క సినిమా పూర్తి చేయడమే గగనమవుతున్నది. ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలై రెండేండ్లు కావొస్తున్నది. ఇప్పుడాయన ‘డ్రాగన్’ షూటింగ్లో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్‌కు మరో ఏడాదికి పైగా సమయం పట్టేలా ఉంది. దురదృష్టవశాత్తు ఇటీవలే ఎన్టీఆర్ గాయపడటంతో ఈ సినిమా మరింత ఆలస్యమవుతుందని చెబుతున్నారు. అంటే ఒక్క సినిమా కోసం మూడున్నరేండ్ల విలువైన సమయాన్ని వెచ్చించాల్సి వస్తున్నదని అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.
ఇప్పటివరకు పాన్ ఇండియా ట్రెండ్‌కు దూరంగా ఉన్న అగ్ర హీరో మహేష్‌బాబు ‘వారణాసి’తో తొలిసారి జాతీయ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దీనికోసం ఆయన మూడేండ్ల సమయాన్ని కేటాయించారు. వచ్చే ఏడాది వేసవిలో ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకురానుంది. రామ్‌చరణ్ ‘పెద్ది’కోసం రెండేండ్ల టైమ్ తీసుకున్నారు. ఇక అల్లు అర్జున్ గత ఏడాదికాలంగా ‘రాకా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. వచ్చే సంవత్సరాంతంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అంటే ‘పుష్ప-2’ తర్వాత మరో సినిమా కోసం ఆయన అభిమానులు మూడేండ్లపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ‘కేజీఎఫ్-2’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో యశ్ ‘టాక్సిక్’ కోసం నాలుగేండ్ల సమయాన్ని తీసుకున్నాడు. ఈ నెలలోనే ‘టాక్సిక్’ రిలీజ్ కానుంది.
ఎవరో ఒకరిద్దరు తప్ప అగ్ర హీరోలు పాన్ ఇండియా సినిమాలన్నీ పూర్తి కావడానికి రెండేండ్లకుపైగానే సమయం పడుతున్నది. దీంతో తమ అభిమాన హీరోల సినిమాల కోసం ప్రేక్షకులకు సుదీర్ఘ నిరీక్షణ తప్పడంలేదు. రెండుమూడేండ్ల క్రితం అగ్ర హీరోలు మాత్రమే పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం యువ హీరోలు సైతం పాన్ ఇండియా ట్రెండ్‌కు అట్రాక్ట్ అవుతున్నారు. స్టార్డమ్తో పాటు జాతీయ స్థాయి ఇమేజ్ కోసం ప్రత్యేకంగా కథాంశాల్ని ఎంపిక చేసుకుంటున్నారు. దీనివల్ల సోకాల్డ్ పెద్ద సినిమాలుగా ముద్రపడ్డ ప్రాజెక్ట్స్ అన్నీ ఏండ్ల తరబడి సెట్స్‌పైనే నలిగిపోతున్నాయి.
పాన్ ఇండియా సినిమాలు థియేటర్ల మనుగడపై కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ కాబట్టి పెద్ద హీరోల చిత్రాలకే భారీ ఓపెనింగ్స్ లభిస్తున్నాయి. కంటెంట్ బాగున్నప్పటికీ చిన్న సినిమాలకు థియేటర్లలో ఆక్యుపెన్సీ ఉండటం లేదు. విస్తృతమైన పబ్లిసిటీ ఉంటే తప్ప చిన్న సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రావడం కష్టసాధ్యంగా మారింది. చిన్న సినిమాలు రిలీజైన మూడునాలుగు వారాల్లోనే ఓటీటీలో వస్తుండటం కూడా వాటి ఆదరణ తగ్గడానికి కారణమవుతున్నది. ఓవైపు అగ్ర హీరోల చిత్రాలు ఏడాదికి నాలుగైదుకు మించి రాకపోవడం, చిన్న సినిమాలకు ఆదరణ తగ్గడంతో ఎగ్జిబిటర్లు ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారు. సరైన రెవెన్యూ లేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలావరకు మూతపడే పరిస్థితులొచ్చాయి.
పాన్ ఇండియా మూవీస్ వల్ల నిర్మాతలపై అదనపు భారం పడుతున్నది. ఒక్కో సినిమా ప్రొడక్షన్లోనే రెండుమూడేండ్లు ఉండిపోవడంతో పెట్టుబడులు మొత్తం లాక్ అయిపోతున్నాయి. తీరా సినిమా రిలీజై ఆశించిన ఫలితం సాధించకపోతే ఇన్నేండ్ల శ్రమ మొత్తం వృథా అయిపోవడమే కాకుండా నిర్మాతలు ఆర్థికంగా కోలుకోలేకపోతున్నారు. పాన్ ఇండియా సినిమాల వల్ల హీరోల రెమ్యునరేషన్స్ కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు ఏకంగా వారి పారితోషికాల కోసమే సినిమా బడ్జెట్లో సగభాగాన్ని వెచ్చించాల్సి వస్తున్నది. పాన్ ఇండియా రీచ్‌ని దృష్టిలో పెట్టుకొని చిన్న పాత్రలకు కూడా వివిధ భాషల నుంచి ఆర్టిస్టులను తీసుకోవడం.. వారికి భారీ రెమ్యునరేషన్స్ చెల్లించడం నిర్మాతలకు భారంగా మారుతున్నది.
పాన్ ఇండియా మూవీస్ విషయంలో మలయాళ ఇండస్ట్రీ సరైన విధానాన్ని అనుసరిస్తున్నదని ట్రేడ్ వర్గాల మాట. అక్కడ సినిమాల పరంగా పాన్ ఇండియా రీచ్ కోసం ఎలాంటి ప్రత్యేక కసరత్తులు చేయడం లేదు. నిర్మాణ హంగులకంటే కంటెంట్‌పైనే దృష్టిపెడుతున్నారు. కథానుగుణంగా అవసరమైతే తప్ప ఇతర భాషల నుంచి నటీనటుల్ని తీసుకోవడం లేదు. లోకల్ కంటెంట్‌ను గ్లోబల్ స్టాండర్డ్స్‌లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మలయాళం సినిమాలకు ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఏర్పడిందని అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ కూడా అదే పంథాను ఫాలోకావడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా కొంత మోదం, మరికొంత ఖేదం అన్న చందంగా తెలుగులో పాన్ ఇండియా ట్రెండ్ తయారైందని, నిర్మాతలు సరైన ప్రణాళికతో అడుగులు వేయకపోతే పాన్ ఇండియా సినిమాలు వారి పాలిట శాపంగా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
– సినిమా డెస్క్