కురవి : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కట్టా జగన్నాథం సైబర్ మోసగాళ్ల(Cybercrime) వలలో చిక్కుకుని 9.60 లక్షల రూపాయలు కోల్పోయాడు. ఈనెల 26వ తేదీ ఉదయం హెచ్డీఎఫ్ క్రెడిట్ డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నానని పరిచయమమైన ఓ వ్యక్తి, మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ పెంచుతాం అంటూ జగన్‌కు కాల్ చేశాడు. మొదట నమ్మనన్నా పలు సార్లు ఫోన్ చేసి మీ కార్డు అప్డేట్ చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది సార్ అంటూ విన్నవించడంతో జగన్ ఇందుకు సిద్ధపడ్డాడు.
మోసగాడు ‘మై కార్డ్ యాప్’ ఓపెన్ చేయాలని చెప్పగా జగన్ అలా చేసినా ఫలితం రాలేదు. వెంటనే వాట్సాప్‌లో లింక్ పంపి దానిని ఓపెన్ చేయమని ఒత్తిడి చేశాడు. ఆ తర్వాత మీ పని పూర్తి అయింది సార్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎటువంటి మెసేజ్ రాలేదు. మరునాడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్నాడు. నిమిషాల వ్యవధిలోనే పలు కార్డుల ద్వారా లక్షలాది రూపాయలు డెబిట్ అయినట్లు గమనించాడు. వెంటనే కురవి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గండ్రాతి సతీష్ కు ఫిర్యాదు చేశాడు.