SLBC | నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతంతో పాటు ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు తగినంత నీటి వనరులు రావడం లేదని విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీనిపై అప్పటి ప్రభుత్వాల్లో ప్రతిసారి ప్రతిపక్షం నుంచి సభ్యులు చర్చ చేసేవారు. నాగార్జునసాగర్‌కు ప్రత్యామ్నాయంగా శ్రీశైలం నుంచి నీటిని తీసుకువచ్చే ప్రతిపాదనలపై చర్చించాలని డిమాండ్స్ వెల్లువెతాయి. ఈ క్రమంలో 1978లో టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెనుకబడిన ప్రాంతాల ఇరిగేషన్ మీద చర్చ జరిగింది. దీంతో ఆనాటి ఇరిగేషన్ మంత్రి సుధాకర్ రావు నేతృత్వంలో శ్రీశైలం నుంచి నీటిని అందించడానికి సాధ్యాసాధ్యాలపై ఒక టెక్నికల్ కమిటీ వేశారు. ఈ టెక్నికల్ కమిటీ సర్వే జరిపిన అనంతరం శ్రీశైలం నుంచి మూడు లక్షల ఎకరాలకు టన్నెల్ ద్వారా నీరు అందించవచ్చని రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది.
ఈ రిపోర్టులోనే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగాన్ని 9 మీటర్ల వ్యాసంతో 45 కిలోమీటర్ల పొడవున 300 నుంచి 500 మీటర్ల దిగువన కొండలలో తవ్వాల్సి వస్తుందని ప్రతిపాదన చేశారు. దీని ఆధారంగానే శ్రీశైలం ఎడమ గట్టు నుండి సొరంగ మార్గం తెరపైకి వచ్చింది.
శ్రీశైలం సొరంగ మార్గం ద్వారా నల్లగొండ జిల్లాకు నీరు తీసుకురావడానికి 1979లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీనితో నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అక్కంపల్లి వద్ద సీఎం టంగుటూరి అంజయ్య హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే శ్రీశైలం సొరంగం మార్గం తవ్వకం పైన పెద్ద చర్చే జరిగింది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా తోవ్వాల్సిన సొరంగం పనులు అంత ఈజీగా కావు అనే విషయం గుర్తించారు. సొరంగ మార్గం ద్వారా నీరు తీసుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు అయినా సమయం తీసుకోవచ్చని ఒక అంచనా వేశారు. అప్పటివరకు నల్గొండ జిల్లాకు సాగు తాగునీటికి ఇబ్బంది ఉంటుందని భావించి తాత్కాలికంగా మరో ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. సొరంగ మార్గం పూర్తయ్యేలోపు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ నుంచే నీటిని ఎత్తిపోయడంపైన చర్చ చేశారు.
ఈ క్రమంలో 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు ప్రభుత్వం.. సొరంగమైన.. లిఫ్ట్ అయిన.. అక్కంపల్లి కీలకపాయింట్ కావడం వల్ల అక్కంపల్లి నుండి కాలువ తవ్వడానికి అదే ఏడాది మే నెలలో శంకుస్థాపన చేశారు. ఈ సమయంలోనే ఆంధ్రకు నీళ్లు అందించే శ్రీశైలం కుడి గట్టు కాలువతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎడమ గట్టు కాలువను కూడా పూర్తి చేస్తానని ఎన్టీ రామారావు ప్రకటించారు. అప్పటికే 1982 జులై 29న రూ. 482 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలన ఉత్తర్వులు ఇచ్చారు. 1983 నుంచి 1989 వరకు రూ. 45 కోట్ల ఖర్చుతో కొంత భూసేకరణతో పాటు కొంత మేర ప్రధాన కాలువ పనులను కూడా చేపట్టారు. ఆ తర్వాత 1994 వరకు పనులు నత్తనడక సాగాయి. దీంతో నల్గొండ జిల్లాలో జరుగుతున్న అన్యాయంపై అప్పటికే జిల్లాలో జల ఉద్యమాలు ఉదృతమయ్యాయి. జలసాధన సమితి పేరుతో దుచ్చెర్ల సత్యనారాయణ తో పాటు ఎంతోమంది ఉద్యమకారులు రోడ్ల పైకి వచ్చారు. ఫ్లోరైడ్ విముక్తి పోరాటం కూడా ఉధృతం అందుకుంది . ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.
ఈ నేపథ్యంలోనే సొరంగం మార్గం ప్రతిపాదన పక్కనపెట్టి తాత్కాలిక పద్ధతిలో పుట్టంగండి వద్ద ఎత్తిపోతల పథకం తెరపైకి వచ్చింది. సాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి నీటిని నాలుగు మోటర్ల ద్వారా పుట్టంగండి సిస్టర్న్‌లోకి ఎత్తిపోసే పథకానికి రూపకల్పన చేశారు. అక్కడినుండి కామన్ పాయింట్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలించేందుకు డిజైన్ చేశారు. 1998-99 సంవత్సరం ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1260 కోట్లుగా రూపొందించారు. ఇందులో 2003 నాటికి రూ. 562 కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక పద్ధతిలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. ప్రధాన డిస్ట్రిబ్యూషన్ కాల్వలు, భూసేకరణ ఇతర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సాగర్ బ్యాక్ వాటర్ నుంచి పుట్టంగండి ఎత్తిపోతల ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్‌ను నింపి అక్కడి నుంచి పానగల్ ఉదయం సముద్రం వరకు ప్రధాన కాల్వ ద్వారా నీటిని తరలించారు.
ఇదే సమయంలో అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ జంట నగరాలకు కూడా తాగునీటి కోసం ప్రత్యేకంగా పైప్ లైన్లు వేసి నీరు అందిస్తున్నారు. అయితే ఈ ఎత్తిపోతల పథకం నిర్వహణ భారీ వ్యయంతో కూడినది కావడంతో శాశ్వత ప్రాతిపదికన శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ సొరంగం డిమాండ్ అలాగే ఉంటూ వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు శాశ్వతంగా సాగు తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే ఈ సొరంగ మార్గమే కీలకం అని జిల్లా ప్రజలు ఉద్యమించారు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో 2004లో అధికారంలోకి వచ్చిన అప్పటి వైఎస్ఆర్ సర్కార్ శ్రీశైలం సొరంగ మార్గానికి శ్రీకారం చుట్టింది. 2005 ఆగస్టు 11న పరిపాలన అనుమతులు ఇచ్చి 2006లో పనులకు శంకుస్థాపన చేసి 2007లో పనులు ప్రారంభించింది. మొత్తం 43.93 కిలోమీటర్ల ప్రధాన సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా నేటికీ 34.71 కిలోమీటర్లు పూర్తి అయింది. మిగతా 9.56 కిలోమీటర్ల సొరంగం పూర్తి చేయాల్సి ఉంది. అందుకోసం శ్రీశైలం వైపు ఉన్న ఇన్ లేట్ నుంచి నాలుగు రోజుల కిందట పనులు మొదలు పెట్టగా శనివారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి..
SLBC Tunnel Mishap | మట్టి దిబ్బల్లో బయటపడ్డ చెయ్యి.. వాళ్లు బతికే ఉన్నారా?
SLBC Tunnel | అసలు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ఎందుకు తవ్వుతున్నారు.. దాంతో ఏం లాభం?
SLBC Tunnel | ప్రచారం తప్ప పట్టింపేది.. ఎస్సెల్బీసీ ప్రమాదానికి కారణం అదేనా?
SLBC | 8 మీటర్లు.. 8 మంది.. డెత్‌జోన్‌గా మారిన షియర్ జోన్!