నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel Mishap) చిక్కుకున్నవారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. అయితే సహాయక చర్యలకు మట్టి, నీరు అడ్డుపడుతున్నాయి. ఈ క్రమంలో సొరంగం లోపలికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదంలో చిక్కుకుపోయినవారి ఆనవాళ్లను గుర్తించాయి. టన్నెల్ 14వ కిలోమీటరు వద్ద కుప్ప కూలిన మట్టి దిబ్బల్లో ఓ చెయ్యి బయటపడింది. దీంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాగా, ఆ ఎనిమిదిలో ఎందరు ప్రాణాలతో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బురదలో కురు కప్పుకపోవడంతోపాటు పైనుంచి సిమెంట్ పెళ్లలు పడటంతో ఈ ప్రమాదం తీవ్రతను తెలియజేస్తున్నది. ప్రమాదంలో చిక్కుకుపోయి వారంతా బురదలో కూరుకుపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌పై ఉత్కంఠ కొనసాగుతున్నది.
సొరంగంలో బురద, నీటి ప్రవాహాన్ని ఆపడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించడంతో అక్కడున్న వాటిని తొలగించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ ఎస్పీ గైక్వాడ్ తదితరులు రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు.