SLBC Tunnel | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనకు సర్కార్ ప్రచార యావ తప్ప మరేమీ కాదని ఇంజినీర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పినా వినకుండా, పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టనీయకుండానే పనులను చేపట్టాలని హడావుడి చేయడమే ప్రస్తుత ప్రమాదానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ జిల్లా కరువు పీడిత ప్రాంతాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీటిని అందించాల్సి ఉన్నది.
అందుకోసం 30 టీఎంసీల జలాలను శ్రీశైలం రిజర్వాయర్ జలాశయం నుంచి రెండు సొరంగాల ద్వారా గ్రావిటీ ద్వారా తరలించాలనే లక్ష్యంతో ఎస్సెల్బీసీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2005లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే టన్నెట్ బోర్ మిషన్ (టీబీఎం) టెక్నాలజీ ద్వారా పనులను చేపట్టడం, క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు, తదితర సవాళ్ల నేపథ్యంలో సొరంగాల తవ్వకం పనులు తీవ్ర జాప్యమవుతున్నాయి.
రెండు దశాబ్దాలుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా 43.93 కిలోమీటర్ల మేర టన్నెల్‌ను తవ్వాల్సి ఉండగా, రెండు దశాబ్దాల్లో తవ్వింది 34.372 కిలోమీటర్లు మాత్రమేనంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా 9.56 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పనులను పూర్తి చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో సొరంగం కూలిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ముమ్మాటికీ సర్కార్ వైఫల్యమేనని ఇంజినీర్లు మండిపడుతున్నారు.
43.93 కి.మీ సొరంగం పనులను రెండు వైపుల నుంచి ప్రారంభించారు. ఒకవైపు శ్రీశైలం ముఖద్వారం నుంచి (ఇన్లెట్) అంటే దోమలపెంట నుంచి, మరోవైపు నల్లగొండ జిల్లా మన్యవారిపల్లి నుంచి టన్నెల్ తవ్వకాన్ని ప్రారంభించారు. ఇన్లెట్ ఎండ్ నుంచి 13.937 కి.మీ, అవుట్లెట్ నుంచి 20.435 కి.మీ మేర సొరంగం పని పూర్తయింది. ఇంకా 9.56 కి.మీ మేర సొరంగం తవ్వాల్సి ఉన్నది. టీబీఎం బేరింగ్ బ్రేక్ అవడంతో అవుట్లెట్ టన్నెల్ పనులు ఇప్పటికే నిలిచిపోయాయి.
భారీ సీపేజీ కారణంగా ఇన్లెట్ టన్నెల్ ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నవిధంగా ఆగుతూ, సాగుతూ వస్తున్నాయి. నిమిషానికి పదివేల లీటర్ల చొప్పున సొరంగంలో ఊట వస్తున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సీపేజీని అరికట్టేందుకు దాదాపు మూడు లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ గ్రౌటింగ్ చేశారు. అయినప్పటికీ నీటి ఊట నిలిచిపోని పరిస్థితి. కెమికల్ గ్రౌటింగ్ కూడా చేయడం ప్రారంభించారు. లోపల భూమి పొరలు ఒకే విధంగా లేకపోవడంతో ఒకచోట వినియోగించిన కెమికల్ గ్రౌటింగ్ మరోచోట పనిచేయని పరిస్థితి నెలకొన్నది.
ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తూ, డీవాటరింగ్ చేస్తూ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తూ పనులను చేయాల్సి ఉంటుంది. సూటిగా చెప్పాలంటే ఇన్‌లెట్‌లో పనులు చేపట్టడం కత్తిమీద సాములాంటిందని ఇంజినీర్లు వివరిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ వివరించినా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వచ్చిందని, పనులు చేయాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తూ, మెడ మీద కత్తిపెట్టినంత పనిచేసిందని చెప్తున్నారు. పటిష్ట రక్షణ చర్యలు, గ్రౌటింగ్ నిర్వహించకుండా పనులను ముందుకు తీసుకెళ్లడం వల్లే ప్రస్తుతం మట్టి, సిమెంట్ కప్పులు కూలిపోయాయని వివరిస్తున్నారు. ప్రభుత్వ తొందరపాటు, ఒత్తిడే ఘటనకు ప్రధాన కారణమని ఇంజినీర్ నిపుణులు వివరిస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఒక్కసారిగా కలవరానికి గురైంది. వివరాలు ఎక్కడా పొక్కనీయకుండా జాగ్రత్తపడింది. ఉదయం 8.20 గంటలకు ప్రమాదం సంభవించినా 10.30 గంటల వరకు కూడా విషయం బయటకు రాలేదు. అధికారులు ఎవరూ నొరెత్తవద్దంటూ హుకూం జారీ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. దీంతో ఘటనపై వివరాలను చెప్పేందుకు ఏ ఒక్క అధికారి కూడా ముందుకు రాలేదు.
సొరంగంలోకి పనులకు వెళ్లి, ప్రాణాలతో బయటపడిన కార్మికులను సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉంచింది. ఇతరులెవరూ వారిని కలవకుండా కట్టుదిట్టం చేసింది. లోపల ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఎవరికీ ఇవ్వలేదు. మీడియాకు సైతం లోపలికి వెళ్లేందుకు అనుమతివ్వలేదు. అధికారులను, కార్మికులను కలవనీయకుండా అడ్డుకున్నది. ప్రమాద విషయం బయటకు పొక్కడంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హడావుడిగా అక్కడి వెళ్లారు. ఆ తరువాత సహాయక చర్యలు చేపడుతున్నామంటూ ప్రకటనలు ఇచ్చారు.
ప్రభుత్వం ప్రచారంపై దృష్టి పెట్టింది తప్ప సొరంగం తవ్వకానికి ఎదురవుతున్న సవాళ్లు, వాటి నివారణ చర్యలపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని నిపుణులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సెల్బీసీ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకసారి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలుమార్లు ఎవరికి వారు సమీక్షలు పెట్టడం, ప్రచారం చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎనాడూ దృష్టి సారించలేదని ఇంజినీర్లు చెప్తున్నారు.
కనీసం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించిన దాఖలాల్లేవని వివరిస్తున్నారు. అమెరికా వెళ్లి కంపెనీ ప్రతినిధులతో చర్చించి పరికరాలను తెప్పిస్తున్నామని చెప్పినప్పటికీ, ఇప్పటికీ అవుట్‌లెట్‌లోని టీబీఎంకు సంబంధించిన బేరింగ్ రాలేదు. ప్రాజెక్టుకు భారీగా నిధులను కేటాయించామని చెప్తున్నా.. ఇప్పటివరకు విడుదల చేసింది రూ.60 కోట్లు మించలేదు. అడుగడుగునా కాంగ్రెస్ నేతలు ప్రచారంపై, రాజకీయాలపై దృష్టి పెట్టారు తప్ప, ప్రాజెక్టు రక్షణ చర్యలపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదని ఇంజినీర్లు, నిపుణులు వివరిస్తున్నారు.