SLBC | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్సెల్బీసీ).. ఈ చారిత్రక ప్రాజెక్టు ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగ మార్గంలో పైకప్పు కూలడం.. ఏకంగా ఎనిమిది మంది అందులో చిక్కుకుపోవడం సంచలనమైంది. గల్లంతైనవారిని కాపాడేందుకు భారీ ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అసలు ఈ ముప్పునకు దారితీసిన సాంకేతిక సమస్యలేమిటి? అనే దానిపై సామాన్యుడి నుంచి ఇంజినీరింగ్ వర్గాల వరకు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సొరంగం పైకప్పు కూలడమనేది హఠాత్తుగా జరిగిన పరిణామమే అయినప్పటికీ రెండు, మూడు రోజుల ముందు నుంచే ఆ మేరకు సంకేతాలున్నాయనే ప్రచారం జరుగుతున్నది.
ముఖ్యంగా శనివారం పైకప్పు కుప్పకూలిన చోట ‘ఎనిమిది మీటర్ల’ షియర్ జోన్ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యమే ఇప్పుడు ఎనిమిది మంది ప్రాణాల మీదకు తెచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంజినీరింగ్ పరిభాషలో ఇది ‘స్ట్రక్చరల్, కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్’ కిందకు వస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత సొరంగం లోపల పరిస్థితిని అధ్యయనం చేస్తే గానీ అసలు కారణాలు వెల్లడికావని అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా భారీ పనుల్లో జరిగే ప్రమాదాలైతే ఆందోళనపడాల్సిన అవసరం లేదు. కానీ, సొరంగం పైకప్పు కూలడమంటే సాంకేతికంగా లోతైన కారణాలుంటాయని ఇంజినీరింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వీటిపై స్పష్టత వస్తేనే ప్రాజెక్టులో తదుపరి అడుగులు పడతాయని చెబుతున్నారు. తెలంగాణ బీడు భూములకు గ్రావిటీ మీద కృష్ణాజలాలను అందించే ఏకైక బృహత్తర ప్రాజెక్టు ఎస్సెల్బీసీ కావడం విశేషం. కానీ, ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణం ఆది నుంచి సంక్లిష్ట పరిస్థితుల మధ్యనే కొనసాగుతున్నది.
ప్రధానంగా రాజీవ్ టైగర్ రిజర్వు ఫారెస్టు మీదుగా జలాలు ప్రవహించాల్సి ఉన్నందున నల్లమల అటవీ ప్రాంతాన్ని దాటే వరకు ఎక్కడా బయటికి రాకుండా భూగర్భంలో నుంచే ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం టన్నెల్ బోరింగ్ మిషన్‌ను వాడుతున్నారు. ఇది భూగర్భంలో సొరంగాన్ని తొలుచుకుంటూ ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి వచ్చేది ఉండదు. శ్రీశైలం నుంచి ఒక టీబీఎం (ఇన్లెట్), నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి నుంచి మరో టీబీఎం (అవుట్లెట్) ద్వారా పనులు జరుగుతున్నాయి. ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్లు.. అవుట్లెట్ నుంచి 18 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.
సాధారణంగా సొరంగ మార్గాల నిర్మాణంలో తొలుత యంత్రాలతో భూమిని తొలుచుకుంటూ వెళ్తారు. ఆపై పకడ్బందీగా కాంక్రీట్ లైనింగ్ చేస్తారు. కానీ, టన్నెల్ బోరింగ్ మిషన్ యంత్రంలో ముందు భాగంతో భూమిని తొలచుకుంటూ వెళ్తుంటే… యంత్రంలోని వెనక భాగంలోనే స్టీల్ రింగులు వేస్తూ సిమెంట్ సెగ్మెంట్లను అమర్చి లైనింగ్ చేసే విధానం ఉంటుంది. ప్రస్తుతం ఎస్సెల్బీసీ సొరంగ మార్గంలో అమరుస్తున్న సిమెంట్ సెగ్మెంట్లు మీటరున్నర పొడవు ఉన్నాయి. ఇలా సొరంగ మార్గం మొత్తం మట్టి, రాళ్లు పడకుండా రింగులు వేసుకుంటూ సిమెంట్ సెగ్మెంట్లను బిగిస్తారు.
శ్రీశైలం నుంచి ఇన్లెట్గా నిర్మాణమవుతున్న సొరంగ మార్గంలో ప్రస్తుతం 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. ఈ పనులు దాదాపు నాలుగైదు రోజుల కిందటే మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శనివారం విషాదం చోటుచేసుకుంది. 14వ కిలోమీటర్ వద్ద ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. ఈ ప్రదేశంలో ఎనిమిది మీటర్ల మేర షియర్ జోన్ ఉందనేది గతంలోనే ఇంజినీర్లు గుర్తించారు. అంటే ఆ ఎనిమిది మీటర్ల పరిధిలో భూమి పొరలు అంత బిగుతుగా లేకపోవడంతో పాటు మధ్యలో స్వల్ప సందులు (క్రాక్స్) ఉండే ప్రాంతాన్ని షియర్ జోన్‌గా అభివర్ణిస్తారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పనులు చేయాలంటే ముందుగా సాంకేతికపరమైన అధ్యయనం చేసి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రిటైర్డ్ ఇంజినీర్ ఒకరు తెలిపారు.
సొరంగ మార్గం పనుల్లో సుమారు 18 మీటర్ల మేర సొరంగాన్ని తవ్వినట్టు తెలిసింది. ఇందులోనే ఎనిమిది మీటర్ల షియర్ జోన్ ఉంది. అయితే ఈ జోన్లో పనులు పూర్తయి.. టీబీఎం మరో పది మీటర్ల మేర ముందుకు కూడా పోయినట్టు ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఒక్కసారిగా ఆ ఎనిమిది మీటర్ల షియర్ జోన్ పరిధిలోని రెండు సిమెంటు సెగ్మెంట్ల పైకప్పు కూలినట్టు తెలిసింది. అయితే రెండ్రోజులుగా అక్కడ మట్టి పడుతుండటాన్ని పనులు నిర్వహిస్తున్న సాంకేతిక, ఇతర సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం అందించినట్టు ప్రచారం జరుగుతున్నది. అదే నిజమైతే… అధికారులు వెంటనే ఎందుకు అప్రమత్తం కాలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తొలుత రెండు సిమెంటు సెగ్మెంట్లు అంటే మూడు మీటర్ల మేర పైకప్పు కూలినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నా… అది క్రమంగా వందల మీటర్లకు విస్తరించిందని కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు సెగ్మెంట్ల పైకప్పు కూలి ఆ ప్రభావం కొన్ని సంవత్సరాల కిందట పూర్తయిన సొరంగ మార్గంపైనా పడి తీవ్రత పెరిగిందనే అనుమానాలు వెలువడుతున్నాయి. దీంతో సొరంగం ఎంతదూరం కుప్పకూలిందనే దానిపై స్పష్టత రావడం లేదు. పైగా దీంతో సొరంగం పైకప్పు కూలినచోట ఏ స్థాయిలో పైకి అది విస్తరించిందనేది కూడా అధికారులకు అంతుబట్టడం లేదు.
సొరంగం పైకప్పు కూలడం వెనక ఉన్న సాంకేతిక కారణాలపై పలు రకాల విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా షియర్ జోన్‌గా ఉన్న ఆ ఎనిమిది మీటర్ల పరిధిలో జియోలాజికల్ పరీక్షలు జరిగియా? జరిగితే లోడ్ ఎంత మేర ఉందనేది లెక్కించారా? ఆ మేరకు డిజైన్ రూపొందించి… గ్రౌటింగ్, ఇతరత్రా చర్యలు తీసుకున్నారా? దాని ఆధారంగానే పనులు జరిగాయా? అనే దానిపై ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందులో ఏ ఒక్క అంశంలో లోపం తలెత్తినా మొత్తానికి మోసం వస్తుందని ఇంజినీర్ ఒకరు వ్యాఖ్యానించారు. ప్రధానంగా సొరంగం పైకప్పు కూలినప్పుడు స్టీల్ రింగు పడిపోవడమంటే లోడ్‌ను లెక్కించే అంచనా తప్పి… అది డిజైన్ లోపానికి దారితీసిందా? నిర్మాణలోపం తలెత్తిందా? అనేది పరిశీలనలో తేలుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.