Ram Charan | పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో మాస్, ఎమోషన్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. సోమవారం సాయంత్రం విడుదలైన ఈ లిరికల్ వీడియోకు సోషల్ మీడియాలో అద్భుత స్పందన లభిస్తోంది. “రై రై రారా.. అడ్డేలేని దారై రారా” అంటూ సాగే ఈ పాటకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించడం విశేషం. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం మోటివేషనల్ టచ్‌తో ఆకట్టుకుంటోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు హై ఎనర్జీ వైబ్ తీసుకొచ్చింది.
ముఖ్యంగా రామ్ చరణ్ వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు, వేగవంతమైన మూమెంట్స్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. కొందరు అభిమానులు ఆయన డ్యాన్స్‌ను ‘చిరుత’ రోజుల్ని గుర్తు చేసేలా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్‌లో కనిపించిన ఐకానిక్ క్రికెట్ షాట్ కూడా ఈ పాటలో ఉండటంతో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నెలకొంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లి కోట్ల సంఖ్యలో వ్యూస్ సాధించడం చిత్రంపై ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. ఈ సాంగ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘రై రై రారా’ సాంగ్ స్క్రీన్‌పై అక్షరాలా అగ్నిజ్వాలలా ఉందని, ఎనర్జీ, ఎమోషన్, సినీమాటిక్ బ్రిలియన్స్ అద్భుతంగా కలిసిపోయాయని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా రామ్ చరణ్ గ్రేస్, వేగం చూసి ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆయన మూవ్స్ చూడటం ఒక ప్రత్యేక అనుభూతి అని అభిప్రాయపడ్డారు.
అలాగే దర్శకుడు బుచ్చిబాబు సానా పిక్చరైజేషన్, ఏఆర్ రెహమాన్ సంగీతం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్ అన్నీ కలిసి సాంగ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయని అభినందించారు. చిరంజీవి ప్రశంసలకు స్పందించిన బుచ్చిబాబు సానా భావోద్వేగానికి గురయ్యారు. షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు తీవ్ర జ్వరం ఉన్నప్పటికీ, షూట్ ఆపకుండా చిరునవ్వుతో డ్యాన్స్ పూర్తి చేశారని ఆయన ట్వీట్లో వెల్లడించారు. ఆ అంకితభావం మెగాస్టార్ నుంచి వచ్చిన వారసత్వమేనని పేర్కొంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.