న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై క్షమాపణలు చెప్పిన సోషల్ మీడియాల మాతృ సంస్థ ‘మెటా’ ఇప్పడు బీజేపీకి దాసోహం అయినట్టు కనిపిస్తున్నది. కాషాయ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను తొలగిస్తూ, ఆ పార్టీ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రముఖ నేతలు, జర్నలిస్టుల ఖాతాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ‘మెటా’పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మెటా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను భారత్కు మాత్రమే పరిమితం చేసిందని తెలిపారు. కంపెనీ నుంచి వివరణ కోరినా ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. గత కొన్ని నెలలుగా మీడియా సంస్థ ‘వైర్’కూడా మెటా ఆంక్షలను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.
యూఎస్ ఫెడరల్ కోర్టులో నిఖిల్ గుప్తా విచారణ వాయిదా పడిన విషయంపై ‘ది వైర్’ రాసిన పోస్టులను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆగస్టు 7న నిలిపివేశాయి. హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ విచారణకు హాజకు కావాలని కోరడమే ఇందుకు కారణమని ‘వైర్’ పేర్కొంది. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సభ్యులు, ఇతర నిరసనకారులు పెట్టిన పోస్టులు కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగింపునకు గురవుతున్నాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్ న్యూస్ ఇన్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్, రాజకీయ కంటెంట్ సృష్టికర్త సృష్టి ఖన్నా కూడా తమ పోస్టులను తొలగించారని ఆరోపించారు. ఇండియన్ కాంగ్రెస్, సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్, వార్తా పోర్టల్ ‘స్క్రోల్ ఇన్’, ‘ది హిందూ’ తదితర ఖాతాలు బ్లాక్ అయ్యాయని సమాచారం.