మహబూబ్‌నగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి’.. ఈ కాలనీలో మీరుండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ ఇవీ బిగ్‌బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీవాసులకు చేస్తున్న హెచ్చరికలు. అంతటితోనే ఆగడంలేదు. హడలిపోయిన బాధితుల నుంచి కారు చౌకగా ఆ ప్లాట్లకు అగ్రిమెంట్లు చేసుకొని ఎంచక్కా కాజేస్తున్నారు. ఇలా ఇక్కడ ‘బిగ్‌బ్రదర్స్ చెప్పిందే వేదం.. రాసిందే శాసనం’గా మారింది. ‘నిర్వాసితుల కాలనీపై బిగ్‌బ్రదర్స్ పడగ’ అన్న శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ప్రత్యేక కథనం సంచలనం సృష్టించింది. ఈ మేరకు తమకు జరిగిన అన్యాయాలను వివరించేందుకు చాలామంది భూ బాధితులు మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ను ఆశ్రయించారు. దీంతో ‘నమస్తే తెలంగాణ’ బృందం హకీంపేట, లగచర్లతోపాటు సమీప గ్రామాలను సందర్శించగా అనేకమంది బాధితులు ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాలపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులకు కంటితుడుపు చర్యగా కేటాయించిన ప్లాట్లపై బిగ్‌బ్రదర్స్ కన్నుపడింది.
కొందరు కాంగ్రెస్ నేతలను ఊసిగొలిపి నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న నిర్వాసితుల కాలనీపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇచ్చిన ప్లాట్లను కూడా లాక్కొనే ప్రయత్నంపై పేదలు భగ్గుమంటున్నారు. పచ్చని పొలాలతో దర్జాగా బతుకుతున్న రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొని అరకొర పరిహారమిచ్చారు. ఆ తర్వాత నిర్వాసితులకు పంపిణీ చేసిన ప్లాట్లు కూడా వారికి దక్కకుండా బిగ్‌బ్రదర్స్ భారీ పథకాన్ని రచిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఏర్పాటు చేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో సాగుతున్న భూభాగోతం, నిర్వాసితుల గోసపై ‘నమస్తే తెలంగాణ’ మరో ప్రత్యేక కథనం.
మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో సేకరించిన భూములు మొత్తాన్ని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థకు (టీజీఐఐసీ)కి అప్పగించారు. భూసేకరణ 2013 చట్టం ప్రకారంగా బాధితులకు పరిహారం ఇస్తున్నట్టు నమ్మించడమే కాకుండా భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్టు బురిడీ కొట్టిస్తున్నారు. కానీ వాస్తవంగా అక్కడ ఏర్పాటు చేస్తున్న కాలనీలో మౌలిక సదుపాయాలను మరచి అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా లేఅవుట్లు చేశారు. భూ బాధితులకు అరకొరగా పంచిపెట్టి అసలు సిసలైన భూములను కొట్టేందుకు బిగ్‌స్కెచ్ వేశారు. ఈ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేకుండా నాసిరకం బీటీ రోడ్లను వేసి మమ అనిపిస్తున్నారు. ఆ ప్లాట్లలోనే అండర్ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు సౌకర్యం, రోడ్డు మలుపుల వద్ద కల్వర్టులను నిర్మిస్తూ మరో మోసానికి పాల్పడుతున్నారు. అన్నీ చేస్తున్నట్టు నమ్మించి అసలు సిసలైన రహదారుల వెంబడి ఉన్న స్థలాలను లేఅవుట్లలో ఖాళీగా చూపించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీఎం సొంత నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో సుమారు 93 ఎకరాల్లో, 620 మంది భూబాధితులకు ప్లాట్లను కేటాయిస్తున్నారు. దీంతో ఇక్కడ ఓ కొత్త పట్టణమే వెలిసే అవకాశం ఉన్నది. కానీ, భూ బాధితులకు కేటాయించిన కాలనీలో కోట్లు దండుకునే ప్రయత్నమే జరుగుతున్నది తప్ప.. కనీస మౌలిక సదుపాయాలు మాత్రం కరువయ్యాయి. ప్రభుత్వం తరఫున నిర్వాసితుల కోసం ఏర్పాటుచేస్తున్న ఈ కాలనీలో ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల్లో కనీస ప్రమాణాలు పాటించలేదు. వాటిని ఆదరా బాదరాగా వేస్తున్నట్టు కనబడుతున్నది. బీటీ రోడ్లను అడ్డదిడ్డంగా వేస్తూ రూ.కోట్లాది దండుకున్నారు. లేఅవుట్ చేశాక అధికారులకు గుర్తొచ్చిందో? ఏమో? కానీ నిర్వాసితులకు ఇచ్చిన ప్లాట్లలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటుచేస్తూ సరికొత్త అధ్యాయానికి తెర లేపారు. ఈ 93 ఎకరాల భారీ లేఅవుట్లో ఎక్కడ కూడా పార్కులకు కానీ, గుడులకు, బడులకూ స్థలాలు కేటాయించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కేవలం అంగన్వాడీ కేంద్రానికి 1,200 గజాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.
హకీంపేట నిర్వాసితుల కాలనీలో ఓ కుటుంబానికి 8.21 గుంటల భూములను లాక్కొన్నారు. హకీంపేట గ్రామానికి చెందిన ర్యాకం అరుణమ్మకు 2 ఎకరాలు, యాదయ్యకు 2.21 ఎకరాలు, భీమమ్మకు 2 ఎకరాలు, రాజేశ్‌కు 1 ఎకరా, రంజిత్‌కు 1 ఎకరా చొప్పున భూములు ఉన్నాయి. ఇది కోస్గి తునికిమెట్లకు పోయేందుకు కొత్తగా నిర్మిస్తున్న ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నది. ఆ భూములపై కన్నేసిన కాంగ్రెస్ నేతలు ఆ కుటుంబాన్ని నానా తిప్పలు పెడుతున్నారు.ఆ కుటుంబానికి న్యాయంగా రూ.1.50 కోట్ల పరిహారం రావాలి. ‘మా పరిహారం మాకిప్పియ్యండి’ అంటూ ఆ బాధిత కుటుంబం అడిగితే వారిపైనే దౌర్జన్యాలకు దిగుతూ ‘రెండు ఎకరాలకే పరిహారం ఇస్తాం తీసుకుపోండి’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో చేసేదిలేక ఆ కుటుంబం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగకుండా భూసేకరణ అధికారి, తాండూరు ఆర్డీవోను కూడా సంప్రదించారు. దుద్యాల తహసీల్దార్‌కు కూడా వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయంగా రావాల్సిన పరిహారం ఇవ్వాలని, అంతవరకు తమ భూములు తీసుకోవద్దని వేడుకున్నారు. దాదాపు ఏడాదిపాటు తిరిగి తిరిగి.. విసిగి వేసారిన ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ఏకంగా స్టేటస్కో ఆర్డర్లు తీసుకొచ్చింది. అయినా కాంగ్రెస్ నేతల అండదండలతో అధికార యంత్రాంగం బలవంతంగా వారి భూములను లాక్కొని చదును చేసి లేఅవుట్లు చేసి ప్లాట్లు ఏర్పాటు చేశారు. తమ తాతల కాలం నుంచి ఉన్న సమాధులను ప్లాట్ల మధ్యనే ఇరుక్కున్నాయని, తమ ఆరాధ్యదైవమైన పోచమ్మకు సైతం జానెడు జాగ లేకుండా చుట్టూ లేఔట్లలో ప్లాట్లు కేటాయించడంతో ఆ కుటుంబం రగిలిపోతున్నది. అయినా ఆ కుటుంబం న్యాయపరంగా పోరాటం చేస్తూ, కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు ఎదురొడ్డి నిలబడింది. వీళ్లకు న్యాయం జరుగుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.
కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుల రాజ్యాంగం నడుస్తున్నదని, పేదల భూములను బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలో సీఎం సోదరులతోపాటు కొందరు కాంగ్రెస్ నేతల అవినీతి చిట్టా విప్పుతానని స్పష్టంచేశారు. హకీంపేట, లగచర్ల, దుద్యాల, పోలేపల్లి, రోటిబండ్లతండా, పులిచెర్ల తండాల్లో ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించిన భూముల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని, వాటిని ఆధారాలు బయట పెడుతామని తెలిపారు. సోమవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల రౌడీయిజం కొనసాగుతుందని దుయ్యబట్టారు. సీఎం సోదరుడైన తిరుపతిరెడ్డి అండదండలతో కాంగ్రెస్ నేతలంతా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పేదల భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. భూములు కోల్పోయిన వారికి ఇచ్చే ప్లాట్లలో కూడా రేవంత్ సోదరులు రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపడం దుర్మార్గమని పేర్కొన్నారు. హకీంపేట సమీపంలో చేపడుతున్న నిర్వాసితుల కాలనీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేద ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం మొత్తం బిగ్ బ్రదర్స్‌కు దాసోహమైందని, పోలీసు యంత్రాంగమంతా వారి అడుగులకు మడుగులొత్తుతుందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పేద ప్రజలకు న్యాయం చేయకపోతే భారీ ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
దుద్యాల మండలం హకీంపేట గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న నిర్వాసిత కాలనీని మొత్తం కబ్జా చేసేందుకు బిగ్ బ్రదర్స్ అండదండలతో కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే ఇచ్చిన ప్లాట్లను లాక్కొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఈ కాలనీలో ఉండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు అంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆ లేఅవుట్ గుండా కోస్గి-తుంకిమెట్ల ప్రధాన రహదారి వెళ్తున్నది. ఈ రహదారిని కూడా మళ్లించి దాని చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాన్ని కబ్జాచేసే ప్రయత్నం జరుగుతుందని తేలింది. నిర్వాసితుల కాలనీలో ఒక్కొక్క ప్లాటుకు 150 గజాల స్థలం కేటాయించగా, నిర్వాసితుల ప్లాట్లలోనే ఒక మీటర్ వరకు డ్రైనేజీ కోసం కేటాయిస్తున్నారు. దీంతో అసలు ప్లాటు 130 గజాలకు కుదించుకుపోతుంది.