జోహన్నెస్‌బర్గ్ : అధికారంలో ఉన్నవారు ఎన్ని కుట్రలు, కక్షసాధింపు చర్యలు చేపట్టినా దేశంలో న్యాయవ్యవస్థ సజీవంగా ఉందనే విషయాన్ని ఈరోజు వెలువడిన రెండు న్యాయస్థానాల నిర్ణయాలు నిరూపించాయని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నాయకులు నాగరాజు గుర్రాల పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ పదవికి రాజీనామా చేయకుండానే మరో పార్టీలో చేరడం ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమేనని అన్నారు.
“ఈ తీర్పుతో న్యాయం గెలిచింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యమే అంతిమ విజేతలని మరోసారి రుజువైంది. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేల విషయంలోనూ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రజల ఓటుతో గెలిచిన నాయకులు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం” అని నాగరాజు గుర్రాల పేర్కొన్నారు.
అదేవిధంగా, బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. క్రిశాంక్‌కు రిమాండ్ విధించాలన్న అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించడం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు గట్టి సమాధానమని వ్యాఖ్యానించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేసి, వారి గొంతును అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణలో రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు నిరాశలో ఉన్నారని, అనేక రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
“ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ద్వారా ప్రజల ప్రశ్నలను ఆపలేరు. అధికారంలో ఉన్నవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా చట్టానికి ఎవరూ అతీతులు కారు. హైకోర్టు తీర్పు, మన్నె క్రిశాంక్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించడం ఈ రెండు నిర్ణయాలు న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరిచాయి” అని అన్నారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెబుతారన్నారు.