కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ ఎదురైంది. ఆమె నేతృత్వంలోని టీఎంసీ వర్గం అభ్యర్థిని సంచితా ప్రధాన్ డే, కీలక నందిగ్రామ్ ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. (Mamata Banerjee) బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయారు. రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన సీఎం సువేందు అధికారి, నందిగ్రామ్ స్థానాన్ని వదులుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
కాగా, నందిగ్రామ్ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు తొలుత వెల్లువెత్తాయి. అయితే ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం ఆరోపణలకు సంబంధించి 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేయడంతో ఉద్యోగాన్ని కోల్పోయిన నందిగ్రామ్‌కు చెందిన ఉపాధ్యాయురాలు సంచితా ప్రధాన్ డేను తమ అభ్యర్థిగా మమతా నేతృత్వంలోని టీఎంసీ వర్గం ప్రకటించింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న నందిగ్రామ్ స్థానం నుంచి పోటీకి దిగిన ఆ అభ్యర్థిని మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమైన తర్వాత తన అభ్యర్థిత్వాన్ని సంచితా ప్రధాన్ డే ఉపసంహరించుకున్నారు.
మరోవైపు మమతా బెనర్జీ దీనిపై స్పందించారు. నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు తన మద్దతును శుక్రవారం ప్రకటించారు. నందిగ్రామ్ నుంచి తమ వర్గం తరుఫున మరో అభ్యర్థిని నిలబెట్టబోమని ఆమె తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. భారతదేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలని నేను కోరుకుంటున్నా. మా పూర్తి సంఘీభావం ఇండియా కూటమికే’ అని మీడియాతో అన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తనకు ఫోన్ చేశారని, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు సందేశాన్ని పోస్ట్ చేసినట్లు వివరించారు.
కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో వర్గపోరు మొదలైంది. ఎమ్మెల్యే రితాబ్రత బెనర్జీ తిరుగుబాటు నేపథ్యంలో ఆ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ వివాదం నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పేరు, ఎన్నికల చిహ్నాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) తాత్కాలికంగా నిలిపివేసింది.
అయితే అక్టోబర్ 6న బెంగాల్లో రెండు స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల కోసం ఈ రెండు వర్గాలకు తాత్కాలిక పార్టీ పేర్లు, గుర్తులను ఈసీ కేటాయించింది. మమతా బెనర్జీ వర్గానికి ‘మమత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరు, ‘ఫుట్‌బాల్ క్రీడాకారుడు’ చిహ్నాన్ని ఖరారు చేసింది. ప్రత్యర్థి వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ పేరు, ఎన్వలప్ (కవరు)ను చిహ్నంగా కేటాయించింది.