వార్షిక పరీక్షలంటేనే విద్యార్థులకు టెన్షన్ టెన్షన్‌గా ఉంటుంది. దీనికితోడు పరీక్షా కేంద్రాలు సైతం దూరంగా ఉంటే ఇక ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. పరీక్ష సమయానికి ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలంటే నానా తంటాలు పడాల్సిందే. భద్రాద్రి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలు విద్యార్థులకు దూరాభారంగా ఉన్నాయి. ఏకంగా నాలుగు మండలాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచే శారు. దీంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ‘ప్రైవేటు కాలేజీలు వద్దు – సర్కారు కాలేజీలే ముద్దు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తూనే ఇలా పరీక్షా కేంద్రాలను విద్యార్థులకు అందుబాటులో లేకుండా ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షా సమయానికి కేంద్రానికి చేరుకోవాలంటే బస్సులు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదు. పరీక్షా కేంద్రాలు ఇలా దూరంగా ఏర్పాటు చేయడంతో తమ పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ)
ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరుగనున్నాయి. పరీక్షలు రాసేందుకు ఈసారి కూడా భద్రాద్రి జిల్లా విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇంటర్ విద్యపై పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నది. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. భద్రాద్రి జిల్లాలో 18,600 మంది విద్యార్థుల కోసం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. జిల్లాలో 23 మండలాలుండగా.. అందులో ఐదు మండలాలైన ఆళ్లపల్లి, కరకగూడెం, దమ్మపేట, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లిల్లో సర్కారు కాలేజీలు లేవు. దీంతో విద్యార్థులు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పరీక్షలు రాయాల్సి వస్తున్నది. ఇంటర్ విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినా.. అవి మండల కేంద్రాలకు మాత్రమే వస్తుంటాయి. పల్లెప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సుల్లేక ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
ఇవిగో సమస్యలు..
పరీక్ష కేంద్రం ఏర్పాటుచేయాలి
మా మండలంలో ఐదు కాలేజీలు ఉన్నాయి. కానీ పరీక్షా కేంద్రం మాత్రం లేదు. మా మండల విద్యార్థులు ఏటా ఇలానే ఇబ్బందులు పడుతున్నారు. బస్సులపై వెళ్లి పరీక్ష రాయాల్సి వస్తున్నది. స్థానికంగా పరీక్షా కేంద్రం ఉంటే పరీక్షా సమయం వరకు కొంత రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదయాన్నే లేచి తయారై బస్సు కోసం చూడాలి. దీంతో ఒత్తిడికి గురవుతున్నాం. మాకు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి.
-పి.వేణు, ఇంటర్ ఫస్టియర్, అన్నపురెడ్డిపల్లి
మాకు బస్సులు కూడా లేవు..
మాది ఆళ్లపల్లి మండలం. మర్కోడులో ఒకేషనల్ కోర్సు చేస్తున్నాను. కాలేజీ ఉందిగానీ పరీక్ష కేంద్రం లేదు. మా ప్రాంతానికి బస్సులు కూడా ఉండవు. టాటామేజిక్, టాటా ఏస్ వంటి ప్రైవేటు వాహనాలు ఎక్కి వెళ్లాలి. అదే రూట్లో వాహనం పంచర్ అయిందంటే పరీక్ష పోయినట్లే. అసలే మారుమూల అటవీ ప్రాంతం. గుండాల 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
-ఎండీ అస్లాం, ఒకేషనల్ ఇంటర్, మర్కోడు, ఆళ్లపల్లి
బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం..
జిల్లాలో ఐదు మండలాల్లో ప్రభుత్వ కాలేజీలు లేవు. గత ఏడాది జూలూరుపాడు మండలంలో కూడా లేదు. ఈసారి అక్కడ సెంటర్ వచ్చింది. దూరం వెళ్లేవారికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. విద్యార్థుల కోసం ఆర్టీసీ సంస్థ తన బస్సులను అందుబాటులో ఉంచుతోంది. ఆళ్లపల్లి రూట్లో కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. అన్నపురెడ్డిపల్లి మండలంలో పరీక్షా కేంద్రం అవసరాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– హెచ్.వెంకటేశ్వరరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
మండలం :పరీక్షా కేంద్రం: దూరం
ఆళ్లపల్లి :గుండాల: 25 కిలోమీటర్లు
కరకగూడెం పినపాక :15 కిలోమీటర్లు
దమ్మపేట :అశ్వారావుపేట :12 కిలోమీటర్లు
సుజాతనగర్ :కొత్తగూడెం: 13 కిలోమీటర్లు
అన్నపురెడ్డిపల్లి :చండ్రుగొండ: 17 కిలోమీటర్లు